రాఖీ పండుగను పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. రక్షాబంధన్ ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, సహోదరత్వానికి ఈ వేడుక నిదర్శనంలా నిలుస్తుందని అభివర్ణించారు. ఇదొక గొప్ప సందర్భమని, జీవితకాలం పాటు తమ అనుబంధం కొనసాగాలని కోరుకుంటూ అన్నదమ్ముల చేతికి మమతానురాగాలతో రక్షా బంధనాన్ని కడతారని రాఖీ పండుగ ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్ తెలిపారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా
ఏపీ సీఎం జగన్ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు ఆయన ఆదివారం ట్విట్ చేశారు. ‘‘ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా దేశచరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనన్ని ముందడుగులు వేసిన ప్రభుత్వంగా... రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అమ్మకూ, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
సోదర బంధానికి ప్రతీక : చంద్రబాబు
'కులమతాలకు అతీతంగా నిర్వహించుకునేది రాఖీ పండుగ. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను, ఆప్యాయతలను నింపే పండుగ రక్షాబంధన్. స్త్రీ, పురుషులందరూ సోదరభావంతో మెలిగినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావుండదు. సోదర బంధానికి ప్రతీకగా రాఖీ పండుగను నిర్వహించుకుంటారు. మానవీయ సంబంధాలను ఇది మరింత పటిష్ఠం చేస్తుంది.' అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
హత్యాచారాలు అడ్డుకోగలడమే నిజమైన రక్షాబంధన్ : పవన్
'హత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధ కలిగిస్తున్నాయి. గుంటూరు రమ్య హత్య, విజయనగరంలో రాములమ్మపై హత్యాయత్నం వంటి దుస్సంఘటనలు మనసును కలిచి వేస్తున్నాయి. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెళ్లు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. ఆడపడుచులు నిర్భయంగా తిరిగేలా భరోసా ఇవ్వాలి. భారతీయుల బాంధవ్యాలను చాటిచెప్పే వేడుకే రక్షాబంధన్. దేశం బలంగా ఉండాలంటే కుటుంబాలు సమైక్యంగా ఉండాలి' అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాఖీ పూర్ణిమ సందర్భంగా ఆయన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తా : లోకేశ్
సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. 'తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెబుతోంది. కానీ ఈ రోజు గౌరవప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారే మహిళలతో అగౌరవంగా మాట్లాడుతుండటం మన దురదృష్టం. అందుకే రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు. ఇకపై ఎక్కడ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఒక అన్నగా స్పందిస్తానని ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి చెల్లికి నేను హామీ ఇస్తున్నాను. అంతేకాదు ఏపీలో ఇప్పటివరకు ఉన్మాదుల దుశ్చర్యలకు బలైపోయిన ప్రతి ఆడపిల్లకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నానని' లోకేశ్ అన్నారు.
Also Read: Jagan Sharmila Rakhi : ఈసారి సీఎం జగన్.. షర్మిలకు 'హ్యాండ్' ఇస్తారా?
Also Read: Raksha Bandhan: ఆవు పేడతో అద్భుత రాఖీలు.. అబ్బో! వీటిని ట్రై చేస్తే నిజంగా ఎన్ని ఉపయోగాలో..
Also Read: Rakhi Wishes in Telugu: రాఖీ పండుగ.. ఈ అందమైన కొటేషన్లతో శుభాకాంక్షలు తెలపండి