అది 2017 డిసెంబర్. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రుకు చెందిన 55 ఏళ్ల వరలక్ష్మి, దాదాపు మరో 25 మంది మహిళలు తమ ఊళ్లో మద్య దుకాణం కానీ బెల్ట్ దుకాణాలు కానీ నిర్వహించటానికి వీల్లేదంటూ ఆందోళనకి దిగారు.తర్వాత ఊళ్లోని చేపల చెరువులో దూకేశారు. 


గత నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 18 మంది మరణించారు. కల్తీ సారా తాగి మరణించారని విపక్షాలు ఆరోపిస్తుంటే.. అవాస్త ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.


పై రెండు వేర్వేరు సంఘటనలు అయినా గ్రౌండ్‌లో ఉన్న పరిస్థితికి అద్దం పట్టే రియల్ సంఘటనలు. మద్యం ఎంతగా గ్రామాల్లో పారుతుందో చెప్పేందుకు ఉదాహరణలు. 


నిషేధం ఎంత వరకు వచ్చింది


ఇందులో వాస్తవం ఏంటి, అసలు ప్రజలు ఎలా మరణించారనే అంశంపై ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వం, ప్రతిపక్షం ఎవరికి వారు తమకు నచ్చిన వివరణ ఇస్తున్నారు. అసలు రాష్ట్రంలో మద్య నిషేధం లెక్కేంటి? మద్య నిషేధం ఉన్న రాష్ట్రాల్లో కేసుల పరిస్థితి ఏంటి? మద్య నిషేధంపై ప్రభుత్వ వాదనేంటో ఓసారి చూద్దాం. 


వైసీపీ హామీల్లో ప్రధాన హామి 


మద్యపాన నిషేధం వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది. దశలవారీగా నిషేధం విధిస్తామని చెప్పిన ప్రభుత్వం.. బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకు కొత్త పాలసీ తీసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను క్యాన్సిల్ చేసింది. ప్రభుత్వమే మద్యం అమ్మాలని నిర్ణయించింది. 


భారీగా పెరిగన కేసులు


2020 మే నుంచి 2021 డిసెంబర్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా తయారీదారులపై 80,206 కేసులు నమోదు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా 29,101 కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణ చేస్తున్న మధ్యం కేసులు  43,335. ఇవన్నీ ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో పెట్టిన కేసులు ఇవి.


సెబ్‌ ఆధ్వర్యంలో దాడులు


మే 2020లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 2021లో ఆనాటి డీజీపీ గౌతం సావాంగ్  ఎస్‌ఈబీ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. 2020 లో నాటు సారా తయారీ, అక్రమ రవాణ కేసులు 63,310 అని వెల్లడించారు. అదే 2021లో వాటి సంఖ్య 85,759. అంటే 35 శాతం కేసుల సంఖ్య పెరిగింది.


మహిళా సాధికారతకు స్వర్ణయుగం అని ప్రభుత్వం ప్రకటన 


ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ కారణంగా చాలా మార్పు వచ్చిందని చెబుతోంది ప్రభుత్వం. మధ్యం అమ్మకాలు తగ్గాయి అంటోంది. ఇది ‘మహిళా సాధికారతకు స్వర్ణయుగం’ అని ప్రకటించింది. 2021 నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో "మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి అని తెలిపింది. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు మూత పడ్డాయి. ఔట్‌లెట్ల సంఖ్య భారీగా తగ్గించాం. ఇంతకు ముందు 34 లక్షల కేసుల IMFL విక్రయాలు ఉండగా ఇప్పుడు 21.22 లక్షల కేసులకు పడిపోయింది. బీరు విక్రయాలు 17 లక్షల కేస్‌లు ఉంటే ఇప్పుడు 7 లక్షలకు  తగ్గింది” అని ఉంది.


చీప్‌ ప్రచారం అంటున్నాయి విపక్షాలు


ఇదంతా అవాస్త ప్రచారమంటు మండిపడుతున్నాయి విపక్షాలు. చీప్ లిక్కర్ రేట్లు పెంపు కారణంగానే ప్రజలు నాటు సారా, కల్తి సారాకు బానిసలు అవుతున్నారన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.జంగారెడ్డిగూడెంలో జరిగింది కూడా అదే అంటున్నాయని. తెలిసి చనిపోయింది 25మందే,  తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలన్నది టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ప్రధాన డిమాండ్.


ఖజానాకు భారీ ఆదాయం


ఎవరికి అనుకూల వాదన వాళ్లు చేస్తున్నారు. అయితే ఆదాయ పరంగా చూస్తే మాత్రం మద్య ఆదాయంతో ఖజనా కళకళలాడుతోంది. ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా 2018-19లో వచ్చిన ఆదాయం 6,222 కోట్ల రూపాయలు. రాష్ట్రం మొత్తం ఆదాయం 1,05,062 కోట్ల రూపాయలు. 2019-20లో ఎక్సైజ్ ఆదాయం 6,914 కోట్ల రూపాయలు. 2020-21లో ఎక్సైజ్ ఆదాయం 11,575 కోట్ల రూపాయలు. 2021-22కి గాను జనవరి 2022కి ఎక్సైజ్ ఆదాయం 10,922 కోట్ల రూపాయలు.


జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలు 15-20 శాతం పెట్రోల్‌ సేల్స్ టాక్స్ పైన, 10-15 శాతం మద్యం అమ్మకాల ఆదాయం పై ఆధారపడి ఉన్నాయని రిజర్వ బ్యాంకు చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం చూస్తే ఇది అర్థమవుతుంది. 


 దిగొచ్చిన ప్రభుత్వం


పొరుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున తరలి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ సారా తయారు తయారవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. డిసెంబర్ 2021లో రాష్ట్ర ప్రభుత్వం ఇండియ‌న్ మేడ్ ఫారిన్ లిక్క‌ర్ పై 5 నుంచి 12 శాతం, ఇత‌ర అన్ని ర‌కాల మ‌ద్యంపై 20 శాతం వ‌ర‌కు ధ‌ర‌లు త‌గ్గించింది.


మద్య నిషేధం ప్రయోగాలు


మధ్య నిషేదంపై వెనకడుగు వేసేది లేదని అంటుంది ప్రభుత్వం. పూర్తి నిషేధం దిశగా హరియాణా కూడా 1996లో ప్రయోగం చేసింది. కానీ 1998లో నిషేధాన్ని ఎత్తివేశారు. నిషేధం అమలు చేసిన సమయంలో ప్రభుత్వానికి దాదాపు రూ.1200 కోట్ల నష్టం జరిగి ఉండొచ్చని అక్కడి అధికారుల అంచనా.


ఆంధ్రప్రదేశ్ కూడా నిషేధం దిశగా ప్రయోగాలు చేసింది. ఎన్టీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం ఎక్కువైపోతుందని ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి నిషేధం ఎత్తివేశారాయన. 16 నెలలు మాత్రమే ఉన్న ఈ మధ్య నిషేధం రాష్ట్రానికి 1200 కోట్ల నష్టం మిగిల్చిందని అధికారులు తెలిపారు.


గుజరాత్, మిజోరం, నాగాలాండ్, బిహార్ రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో మద్య నిషేధం అమల్లో ఉంది. బిహార్ 2016లో మద్యం నిషేధించింది. జులై 8 వరకు ఉన్న సమాచారం ప్రకారం పట్నా హైకోర్టులో బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్, 2016 కింద నమోదైన కెసులు 2.08 లక్షలు. ఇందులో ఇప్పటి దాకా కేవలం 2,629 కేసుల్లో మాత్రమే విచారణ జరిగింది. 1.67 లక్ష మందిని మద్య నిషేధం ఉల్లంఘన కింద అరెస్ట్ చేశారని బిహార్ ప్రభుత్వం కోర్టుకు 2019 సెప్టెంబరులో ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌లో కూడా పూర్తి స్థాయి మధ్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం. ఒక్కసారి నిషేధం విదిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయని అందుకే దశల వారీగా లిక్కర్‌ వినియోగాన్ని తగ్గిస్తున్నామని చెబుతోంది. మూడేళ్లలో భారీ మార్పు వచ్చిందని చెబుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3000 మద్యం దుకాణాలు, 800 బార్‌ అండ్‌ రెస్టారెంట్స్ ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 


త్రిముఖ వ్యూహంతో మద్య నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు మద్యం వినియోగాన్ని తగ్గిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామంటోంది. అదే టైంలో అక్రమ మద్యం రవాణా, కల్తీ మద్యంపై ఉక్కపాదం మోపుతున్నట్టు లెక్కలతో వివరిస్తోంది.  


ఇంతలా మద్యంపై ఉక్కుపాదం మోతున్న తమ ప్రభుత్వం ఎందుకు కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తుందని ప్రశ్నిస్తోంది అధికార పార్టీ. జంగారెడ్డి గూడెంలో జరిగిన సహజ మరణాలను కల్తీ మద్యం మృతులుగా మార్చేస్తున్నారని మీడియాపై, ప్రతిపక్షంపై మండిపడుతోంది. 
 
జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాలపై ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడింది ABP Desam “అతిగా మద్యం తాగడం వల్లే ఇంతమంది మరణించి ఉంటారని అనుకున్నాం. కానీ అది ఒక్కటే కారణంగా నిర్ధారించలేము. పోస్టుమార్టం చేసి శాంపిల్స్ కలెక్ట్ చేశాం. రిపోర్ట్స్‌ వస్తే కానీ కారణం చెప్పలేము.” అన్నారు.


ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న ప్రజలు ఎలా చనిపోతున్నారో చెప్పలేకపోతే కచ్చితంగా అనుమానాలు రావడం సహజం. దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.