World Coconut Day 2022: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ ప్రజల ఆర్థిక స్థితిగతులను నిర్ణయించేది కొబ్బరి. 'కొడుకు కన్నా కొబ్బరి చెట్టు మిన్న... అనే సామెత ఈ ప్రాంతం నుంచే పుట్టుకొచ్చిందని చెబుతుంటారు. కోనసీమ ప్రజల కష్ట సుఖాల్లో ఈ కల్పవృక్షం ఎంతగానో భరోసాని ఇస్తుందంటారు. ఇక్కడి ప్రతీ ఇంటి పెరట్లోనూ ఓ కొబ్బరి చెట్టు ఉంటుంది. కుటుంబ అవసరాలకు, పోషణకు ఏ లోటూ రానివ్వకుండా చూడటంలో ఈ చెట్టు ప్రధాన పాత్ర పోషిస్తుందంటారు. దేశంలో కొబ్బరి పండించే రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో కొబ్బరి పంట విస్తారంగా ఉంది. ఆయా రాష్ట్రాల పోటీని తట్టుకుని కోనసీమ రైతులు తమ కొబ్బరి పంటను కాపాడుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1.25 లక్షల ఎకరాలలో కొబ్బరి పంట ఉండగా ఒక కోనసీమ ప్రాంతంలోనే 90 వేల ఎకరాలలో కొబ్బరిసాగు చేయడం విశేషం. అయితే మిగిలిన మూడు రాష్ట్రాలలో మాదిరిగా కొబ్బరి ఉప ఉత్పత్తుల పరిశ్రమలు కోనసీమలో నెలకొల్పకపోవడంతో ఈ ప్రాంతం వెనుకంజలోనే ఉంది. 


దేశంలోనే నాలుగో స్థానంలో..


కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి కాగా కొబ్బరి విస్తీర్ణం, ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానంలోనూ, ఉత్పాదకతలో 1వ స్థానంలోనూ ఉంది. సిడిబి 2017-18 లెక్కల ఆధారంగా హెక్టారుకు 14,038 కాయల ఉత్పాదకత ఉన్నప్పటికీ.. మరింత దిగుబడులు పెంచడానికి చాలా అవకాశం ఉంది. శాస్త్రీయమైన ఆధునిక సేద్యవు వద్దతులతో కొబ్బరి రైతులు కృషి చేస్తే మరింత దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. కొబ్బరి దిగుబడులతోపాటు, ఆదాయం కూడా పెంచుకోవచ్చు. దేశ, విదేశాలలో కొబ్బరి నూనె ధరలు పెరుగుతుండటంతో... కొబ్బరి డిమాండ్ తగ్గే ప్రసక్తే లేదు. అయితే ధర పతనమైనప్పుడు ప్రభుత్వమే నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సి ఉందని రైతులు కోరుకుంటున్నారు.   


కొబ్బరి ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్...


కొబ్బరితో తయారైన ఉపఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ ఉప ఉత్పత్తులలో కోకో కెమికల్స్, కొబ్బరి పాలు, కొబ్బరి నీరు, టెంక, పీచు తదితర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. చాక్లెట్ తయారీలో కూడా ప్రసిద్ధ సంస్థలు కొబ్బరి తురుమును ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఇక చేతితో తయారు చేసిన అలంకార వస్తువులకు మంచి ఆదరణ ఉంది. కొబ్బరి నుంచి పలు రకాల ఉత్పత్తులను తయారుచేసే ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మన రాష్ట్రంలో చాలా అవకాశాలు, వనరులు ఉన్నాయి. కొబ్బరి సాగును పరిశ్రమగా గుర్తించి వివిధ పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి కల్పించడంతోపాటు రైతులు ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అభివృద్ధిలోకి తెస్తున్నటువంటి కొబ్బరి నీరాకు (కొబ్బరి కల్లు) కూడా మంచి ఆదరణ లభిస్తుంది..ఇప్పటికే ఉద్యాన పరిశోధనా సంస్థలు కొబ్బరి నీరా గురించి పరిశోధనలు చేసి ఇది సేవించడం వల్ల ప్రయోజనాలే తేల్చారు. కాబట్టి ప్రభుత్వం కొబ్బరి రైతులకు కాస్త దృష్టి సారించి అభివృద్ధి చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.