వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారుతున్నాయి. వాలంటీర్ల ఫిర్యాదుతో మహిళా కమిషన్‌ పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. జనసేనాని వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు ఇప్పటికే అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు కూడా ఆయనపై మండిపడుతున్నారు.

  


పవన్ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలన్నారు మహిళా కమిషనర్‌ వాసిరెడ్డి పద్మ. అలా చేయకుంటే కనీసం క్షమాపణ అయినా చెప్పాలని డిమాండ్ చేశారు. రెండూ చేయకుంటే మాత్రం మహిళా కమిషన్ పవన్ కల్యాణ్‌ను వెంటాడుతుందని వార్నింగ్ ఇచ్చారు. 


ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అసాంఘి శక్తులకు పాల్పడుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని వాలంటీర్‌ సంఘాలు తప్పుబడుతున్నాయి. దీనిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాయి. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో కూడా ఫిర్యాదు చేస్తున్నాయి. అన్ని సచివాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని ఏపీ వాలంటీర్ సంఘాలు నిర్ణయించాయి. 


వైఎస్‌ఆర్‌సీపీ కూడా దీనిపై సీరియస్‌గా ఆలోచిస్తోంది. పవన్ వ్యాఖ్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పై మంతనాలు జరుపుతున్నారు. చట్టపరంగా సవాల్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.  


కడుపు మంటతో వాలంటీర్లపై పవన్ నీచ వ్యాఖ్యలు అంటూ వైఎస్‌ఆర్‌సీపీ అఫిషియల్ పేజ్‌లో కూడా కామెంట్స్ చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం జగన్‌ ప్రభుత్వంలో సాధ్యమైందని తెలిపింది వైసీపీ. దాంతో జీర్ణించుకోలేకపోతున్న పవన్.. ప్రభుత్వం, ప్రజలకి మధ్య వారధిలా ఉన్న వాలంటీర్లపై నీచ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. ఈయన కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలుపొందలేదని... కానీ కేంద్ర నిఘా వర్గాలు తనకి చెప్పాయంటూ నెపం కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 






పవన్ చేసిన కామెంట్స్‌పై వైఎస్‌ఆర్‌సీపీ కౌంటర్ ప్రచారం కూడా రెడీ చేసింది. పార్టీ నేతలతో కౌంటర్‌ అటాక్‌ చేయడమే కాకుండా వాలంటీర్లతో కూడా విమర్శలు చేయిస్తోంది. వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్లు చేయిస్తోంది.






మంత్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఉదయం మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ... తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అమ్మాయిలు పవన్ కల్యాణ్ అంటేనే భయపడుతున్నారని ఆరోపించారు.