Andhra Pradesh: ఎంద‌రో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీస‌ర్లు రాష్ట్రంలో విధులు నిర్వ‌హిస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ మాత్రం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్ద‌రు బ్యూరోక్రాట్లు ప్రేమించి వివాహం చేసుకుని ఒక‌టి కావ‌డమే. మ‌రీ ముఖ్యంగా వీరిద్ద‌రూ ఒకేచోట ఏలూరు జిల్లాలో ప‌నిచేస్తుండ‌ట‌మే మ‌రింత మంది దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు.. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివ కిశోర్‌, ఏలూరు జాయింట్‌ కలెక్టర్ పెద్దిటి ధాత్రిరెడ్డి. వీరిలో కొమ్మి ప్రతాప్‌ శివ కిశోర్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన‌ వారు కాగా, ధాత్రి రెడ్డి యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు చెందిన తెలంగాణ‌ అమ్మాయి. ధాత్రిరెడ్డి, కిశోర్.. ఇద్దరూ ఐఐటీ, ఖరగ్‌పూర్‌‌లో ఇంజనీరింగ్ చదివారు. విశాఖ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్న స‌మ‌యంలో ఒక‌ర్నొక‌రు ఇష్ట‌ప‌డి గ‌తేడాది చివర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.


సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వ‌దిలేసి.. మూడో ప్ర‌య‌త్నంలో విజయం


కొమ్మి ప్రతాప్‌ శివ కిశోర్‌ 2019 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామం. తండ్రి కొమ్మి నారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి నిర్మల గృహిణి. చుంచులూరులోని జిల్లా పరిషత్‌ హైస్కూలులో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నారు శివ కిశోర్. నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్‌ నవోదయ స్కూళ్లో 9, 10వ తరగతులు చదివారు. 




ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బయో టెక్నాలజీ, బయో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వెంటనే బెంగళూరులో ప్రముఖ సంస్థలో ఉద్యోగంలో చేరారు. సీనియర్‌ సైంటిస్ట్‌‌గా ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌లో 4 ఏళ్లు పనిచేశారు. రీసెర్చ్‌ కన్సల్‌టెంట్, స్టూడెంట్‌ అడ్వయిజర్‌గానూ పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. తొలి రెండు ప్రయత్నాల్లో సివిల్స్‌ రాలేదు. మూడోసారి పట్టుదలతో సాధించారు. 153వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌‌కు ఎంపికయ్యారు. 2018లో హైదరాబాద్‌ సర్ధార్ వల్లభ్ భాయ్‌ పటేల్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న శివ కిశోర్‌కు కర్నూలు జిల్లాలో ట్రైనీ ఐపీఎస్‌గా తొలి పోస్టింగ్ ఇచ్చారు. ఎమ్మిగనూరు నుంచి ఆయన కెరీర్ ప్రారంభమైంది. ప్రతాప్ కిషోర్ .. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలోనే ప్రధాని సిల్వర్ కప్ అందుకున్నారు. సమర్ధుడైన యువ అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రతాప్ శివ కిషోర్ ను తాజాగా ప్రభుత్వం ఏలూరు జిల్లా ఎస్పీగా నియమించింది. 




ఐపీఎస్ వ‌ద్ద‌నుకుని ఐఏఎస్ సాధించిన ధాత్రి


పెద్దిటి ధాత్రిరెడ్డి తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామంలో జన్మించారు. ధాత్రిరెడ్డి విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. 2001 నుంచి హైదరాబాద్‌లోని జోసఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆమె చదివారు. ఎస్‌టీ ప్యాట్రిక్స్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్ చదివారు. 2011 నుంచి 2015 వరకు ఐఐటీ, ఖరగ్‌పూర్‌‌లో ఇంజనీరింగ్‌ చేశారు.  తొలుత ధాత్రిరెడ్డి కూడా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2019లో ఐపీఎస్‌ సాధించి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. ఐఏఎస్‌ సాధించాలనే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్‌లో 46వ ర్యాంకు సాధించారు. ఒడిశా కేడర్ అధికారిణిగా 2020 అక్టోబరులో సబ్‌ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2023లో ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు ధాత్రిరెడ్డి. పాడేరు సబ్‌ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. అదే సమయంలో చింతపల్లి ఏఎస్‌పీగా కిశోర్‌ బాధ్యతలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లోనూ గొప్పగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. ఈ సమయంలోనే ఒకర్నొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.


సేవా కార్య‌క్ర‌మాలంటే చాలా ఇష్టం..
చింతపల్లి, పాడేరు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలైనా ఇరువురికీ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేపథ్యం, సేవా దృక్పథం ఉండ‌టంతో ప్ర‌జ‌ల‌తో చ‌క్క‌గా క‌లిసిపోయారు. పేదలకు సాధ్యమైనంత సేవ చేయాలనేది ఈ జంట ఆలోచ‌న‌. గిరిజనుల పిల్లలకు ప్రతి ఒక్కరికీ విద్య అందేలా వీరిద్దరూ చర్యలు తీసుకున్నారు. పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించేవిధంగా తల్లిదండ్రులను ఒప్పించడంలో విజయవంతం అయ్యారు. ధాత్రిరెడ్డి. చదువుకునే రోజుల నుంచే ఆమె సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టే వారు. 2016లోనే ఫీడ్‌ ఇండియా అనే ఎన్‌జీవోను స్థాపించారు. హైదరాబాద్‌లో హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి, నిరుపేదలకు పంచి పెట్టేవారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏజెన్సీ ప్రాంతంలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో గిరిజనులు ఆమెపై అభిమానం పెంచుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి గిరిజనులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు 



వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోనూ క‌లిసే..


కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఏలూరు జిల్లాకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అక్కడ వరదలు బీభత్సం సృష్టించాయి. ఇరువురు కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో సమావేశాలు ఏర్పాటు చేసి వివరించారు. ప్ర‌జ‌ల ప‌ట్ల మ‌మ‌కారం, వృత్తిప‌ట్ల బాధ్య‌త, స‌మాజంపై అవగాహ‌న ఉన్న ఈ జంట భ‌విష్య‌త్తులో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించాల‌ని కోరుకుందాం.. 


Also Read: అధికారులూ పరుగు పెట్టాల్సిందే- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు: చంద్రబాబు


Also Read:షర్మిల నుంచి వైసీపీకి ముప్పు - కాంగ్రెస్ కూటమిపై వైపు జగన్ అడుగులు వ్యూహాత్మకమేనా ?