Budget 2024-25: కేంద్రబడ్జెట్‌లో ఈసారి ఏపీపై గట్టిగానే ఫోకస్ పెట్టామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే అమరావతికి నిధులు ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కుమ్మరించనున్నారు. ఇప్పుడు రైల్‌ ప్రాజెక్టులపై కీలక ప్రకటన చేశారు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కోసం తొమ్మిదివేల నూట యాభై ఒక్క కోట్లు ఖర్చు చేయనున్నట్టు సభలో తెలిపారు. ఇందులో రెండు వేల కోట్లు అమరావతి రైల్వే లైన్ కోసమేనంటూ వెల్లడించారు. 


ఏపీ రైల్వే ప్రాజెక్టులకు 9వేల కోట్లు


ఇన్నాళ్లు ఆగిపోయిన అమరావతిపై ఇప్పుడు నిధులు వరద పారుతోంది. ఈసారి బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను కేంద్రం ప్రకటించింది. అమరావతి రైల్వేలైన కోసం 2,047 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మీడియా సమావేశంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీంతోపాటు ఇతర పనుల కోసం 9,151 కోట్ల రూపాయాలు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. 2009-14 కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి ఏపీకి ఐదేళ్లు సగటున దాదాపు 900 కోట్లు రూపాయాలు కేటాయిస్తే దానికి పది రెట్లు ఈసారి కేటాయించినట్టు కేంద్ర మంత్రి తన ప్రసంగంలో వెల్లండించారు. 






అమరావతి పరిధిలో కొత్త ప్రాజెక్టు


విద్యుదీకరణ పనులు కూడా ఏపీలో దాదాపు పూర్తైనట్టు కేంద్రమంత్రి తెలిపారు. 73, 743 కోట్ల వ్యయంతో 5,329 కిలోమీటర్ల మేర 41 ప్రాజెక్టులు అమలు అవుతున్నట్టు పేర్కొన్నారు. అమరావతిని ఇతర ప్రాంతాలకు అనుసంధానిస్తూ 56 కిలోమీటర్లు పరిధిలో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్టు వివరించారు. విజయవాడ- ఏరుపాలెం నుంచి అమరావతి స్టేషన్, నంబూరు కు వేసే లైన్ డీపీఆర్‌ దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. 


భూమి ఇచ్చిన తర్వాత రైల్వే జోన్‌ పనులు ప్రారంభం


విశాఖ జోన్‌ ఇంత వరకు ఏపీకి అప్పగించలేదని తెలిపారు వైష్ణవ్. దీనికి సంబంధించిన భూమి ఇంత వరకు ఫైనలైజ్ కాలేదని.. అందుకే ఆలస్యమవుతుందని వివరించారు. కొత్త ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఏపీలో గత పదేళ్లలో 151 కొత్త రైల్వే లైన్లను నిర్మించినట్టు మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. 195 లైన్లను అప్‌గ్రేడ్ చేసిన విద్యుదీకరించామన్నారు. 743 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది విజయవాడ స్టేషన్‌ను 'అమృత్ స్టేషన్‌'గా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు అనకాపల్లి లాంటి మరో 15 స్టేషన్లను ఈ స్కీమ్‌లో చేర్చినట్టు వివరించారు.  


బెంగళూరు- విజయవాడ మధ్య వందేభారత్!
త్వరలోనే బెంగళూరు విజయవాడ స్టేషన్ల మధ్య వందేభారత్‌ రైలును ప్రారంభిస్తామన్నారు అశ్వనీ వైష్ణవ్. ముంబయి, విజయవాడ మధ్య దూరం ఎక్కువగా ఉన్నందున ఈ రెండు స్టేషన్ల మధ్య వందేభారత్ సాధ్యం కాదని తేల్చేశారు. 


Also Read: ఉమ్మడి విశాఖ జిల్లాలాలోని అందమైన జలపాతాలు ఇవే.. సందర్శనకు వెళ్లిపోండి


Also Read: హైదరాబాద్‌కు దగ్గర్లోనే అందమైన వాటర్ ఫాల్స్, పొద్దున్నే వెళ్తే సాయంత్రానికి వచ్చేయొచ్చు!


Also Read: తిరుపతికి అతి సమీపంలోనే ప్రఖ్యాత జలపాతాలు, దేవుడి దర్శనానికి వెళ్లినప్పుడు వీటిపైనా ఓ లుక్కేయండి