Tollywood Producer Natti Kumar satires on YS Jagan | ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వై నాట్ 175 అంటూ డప్పులు కొట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే వచ్చాయని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, కానీ జగన్ డిమాండ్ చేశాడని ఇచ్చేసే విషయం కాదంటూ సెటైర్లు వేశారు. కోటా సీట్లు రాకున్నా ప్రతిపక్ష హోదాను వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) డిమాండ్ చేయడంపై నిర్మాత నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. కనీసం సభలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న విషయం సీఎంగా చేసిన వైఎస్ జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. కానీ పనికట్టుకుని ప్రతిపక్ష హోదాపై జగన్ రాద్ధాంతం చేస్తున్నారో ప్రతీఒక్కరూ ఆలోచించాలని ప్రొడ్యూసర్ నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రతిపక్ష హోదా అనేది ఒకరు ఇస్తే మరొకరు తీసుకునే అంశం కాదు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే సీట్ల రూపంలో ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అంతేకానీ ఎవరంటే వారు డిమాండ్ చేసి తీసుకునేది ఏమాత్రం కాదు. సీఎంగా చేసినా వైఎస్ జగన్ కు దానిపై అవగాహన లేకుండా ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో 50 రోజులు కూడా సరిగ్గా పూర్తి చేసుకోని కూటమి ప్రభుత్వంపై ఏదో ఒక రూపంలో అభాండాలు వేసి, పబ్బం గడుపుకోవాలని మాజీ సీఎం జగన్ చూస్తున్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను చూసి, భరించి, తట్టుకోలేక ఆ పార్టీ అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదు.
ఆయన తీరుతో జగన్‌కే మరింత నష్టం
ఇప్పటికి కూడా వైసీపీ అధినేత జగన్ ఆ విషయాలను గుర్తించకుండా అభాండాలు వేసే పనిలో పడిపోయారు. ఇది ఆయనకే మరింత నష్టం చేకూరుస్తుంది. ప్రతిపక్ష హోదాపై ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం అనేది ఆయన ఇష్టం కావచ్చు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయన్న సంగతిని ఆయన పట్టించుకోకపోవడం విడ్డురంగా ఉంది. తన అరాచక పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఐదేళ్లు గడిపేసిన మాజీ సీఎం జగన్ కు ఇప్పుడు పనిచేసే ప్రజా ప్రభుత్వం వచ్చిందని, కంటగింపుగా ఉందని’ నట్టి కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
జగన్‌కు నిర్మాత నట్టి కుమార్ హితవు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నిత్యం ప్రజాసేవలో, సంక్షేమాభివృద్ధిలో బిజీగా మారుతుంటే.. జగన్ ఇప్పుడే కూటమి ప్రభుత్వం తొలిదశలోనే చూసి, ఓర్చుకోలేకపోతున్నారు. వారి ఐదేళ్ల పాలనలో ఏపీ అభివృద్ధిని చూస్తే జగన్ తట్టుకోలేరు. ఇప్పుడొచ్చిన ఆ 11 సీట్లు కూడా ఆయనకు రావు అన్నది ఖాయమనిపిస్తోంది. ఇప్పటికైనా జగన్ వాస్తవాలను గ్రహించి, ప్రతిపక్ష హోదా గురించి కాకుండా వైసీపీ శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీలో హుందాగా వ్యవహరిస్తేనే రాజకీయాలలో ఆయనకు మనుగడైనా ఉంటుందని’ మాజీ సీఎం జగన్‌కు నిర్మాత నట్టి కుమార్ హితవు పలికారు.