Andhra Pradesh : నేను నిద్రపోను..మిమ్మల్ని నిద్రపోనివ్వను. చంద్రబాబు(Chandra Babu) గురించి చెప్పమంటే అధికారులు క్లుప్తంగా గుర్తుకొచ్చే మాటలు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై చంద్రబాబు ధోరణి ఇదే. శ్రమధానం, ప్రజలవద్దకు పాలన, జన్మభూమి అంటూ ప్రభుత్వ ఉద్యోగులను ఉరుకులు పెట్టించిన ఆయన...మళ్లీ అదే పంథా ఎంచుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనతోపాటు పరుగులు పెట్టాలంటూ హుకుం జారీ చేశారు. 


పరుగు పెట్టాల్సిందే
చంద్రబాబు(Chandra Babu) ఎప్పుడు ఓడిపోయినా..ప్రభుత్వ ఉద్యోగులు ఓడించారు అంటారు. ఎందుకంటే ఆయన పని రాక్షసుడని పార్టీ నేతలు చెబుతుంటారు. ఈ అసంతృప్తిని పార్టీ నేతలు, ఉద్యోగులు చాలాసార్లు బహిరంగానే వ్యక్తపరిచారు. రాష్ట్రాభివృద్ధి అంటూ అధికార యంత్రాంగాన్ని పరుగులుపెట్టిస్తుంటారు. ఏకంగా కలెక్టర్ల సదస్సు 14, 15 గంటల పాటు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే చంద్రబాబు సీఎం సీట్లో ఉంటే అధికారులు ఒళ్లంతా కళ్లు చేసుకొని  పని చేస్తారు. అందరికి చెప్పినట్లు ఆయన దగ్గర ఏదో చెబితే పప్పులు ఉడకవు. ఇప్పటి వరకు  పాలనలో కాస్త రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయిన అధికార యంత్రాగం ఇంకా అందే పంథా కొనసాగించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తాను ఒక్కడినే పరుగులెత్తితే సరిపోదని...మీరు కూడా పరుగులుపెట్టి పనులు చేయాలని ఆదేశించారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధి కోసం వినూత్న ఆలోచనలు తీసుకురావాలని ఆయన సూచించారు. కేవలం సమస్యలను తీసుకుని తన వద్దకు రావడం కాదని...వాటికి పరిష్కారం కూడా మీరే ఆలోచించుకుని రావాలన్నారు. మళ్లీ 1995 చంద్రబాబును చూస్తారని....అంత ఉత్సాహంగా పనిచేయాలని ఆదేశించారు. అప్పడు పనిచేసిన వారు ఎవరైనా ఇంకా ఉన్నారా అని అడగ్గా...ముగ్గురు, నలుగురు చేతులెత్తారు. వారిని అడిగి మిగిలిన వారు కనుక్కోండనని సూచించారు. అప్పుడు అధికార యంత్రాంగం ఎలా పరుగులుపెట్టి పనిచేసేవారే తెలుసుకోవాలన్నారు. ఏదైనా కార్యక్రమానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలో ప్రణాళికతో తనవద్దకు రావాలని...అక్కడికి వచ్చి చర్చించుకుంటూ సమయం వృథా చేయవద్దన్నారు.


కొత్త బాధ్యతలు,లక్ష్యాలు
ఇటీవలే ఐఏఎస్‌లు(IAS), ఐపీఎస్‌(IPS)లను సమూలంగా మార్చేసిన చంద్రబాబు..కీలక బాధ్యతలను సమర్థవంతమైన అధికారులకు అప్పగించారు. ఇప్పుడు వారందరితో సమావేశమైన సీఎం...వారిలో చైతన్యం రగిలించారు. నేను మీ అందరినీ నమ్ముతున్నానని..అందుకే కీలక బాధ్యతలు అప్పగించానని చెప్పారు. మీరు నా నమ్మకాన్ని నిలబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని సూచించారు. గతంలో కొంచెం చూసీ చూడనట్లు వదిలేశానని ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదన్నారు. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని...పనితీరు సరిగా లేకుంటే వెంటనే బదిలీ చేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఐదేళ్ల పాలన తీరు వారికి వివరించి నిర్థిష్టమైన లక్ష్యాలను అందుకోవాలన్నారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి నిధులు సాధించుకోవాలని ఆయన సూచించారు. డబ్బుల్లేవని సాకులు వెతకొద్దని హితవు పలికారు. ఎంపీల బృందంతో సమన్వయం చేసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపుుల జరుపుకోవాలన్నారు.



రాజకీయం వద్దు
రాజకీయ నేతలే రాజకీయం చేస్తారని..అధికారులు మాత్రం ప్రజలు సేవ చేస్తే చాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కదానికి రూల్స్‌ పట్టుకుని వేళ్లాడవద్దని...మానవీయకోణంలో వీలైనంత వరకు పేద ప్రజలకు సాయం చేయాలని ఆయన సూచించారు. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని...అన్నింటికీ రాజకీయ ప్రయోజనం ఆశించవద్దన్నారు.


Also Read: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం- ఈసారి 9వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడి


Also Read: ఢిల్లీ ధర్నాతో జగన్ ఇరుక్కపోయారా ? ఇక బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాల్సిందేనా ?