BJP New President: బీజేపీ జాతీయ అధ్యక్షుని పదవి మార్చితో ముగుస్తుండడంతో ఇప్పుడు ఆ పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నడ్డా వ్యవహరిస్తుండగా బీజేపీలో సీనియర్‌ నాయకుడు, పైగా దక్షిణాదికి చెందిన నేత అయితే దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి బాగుంటుందని బీజేపీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ అధినాయకత్వంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ సానుకూలత కూడా అవసరం కాగా దానికి ప్రధానంగా గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పని చేసిన వారణాసి రామ్‌మాధవ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. తెలంగాణాకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పేరు కూడా వినిపిస్తుండగా అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు మాత్రం రామ్‌మాధవ్‌కే దక్కుతుందని చెప్పుకుంటున్న మాట.


ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో ముందుకు..
ఆర్‌ఎస్‌ఎస్‌లోని పలు కీలక పదవుల్లో పని చేసిన రామ్‌మాధవ్‌కు అక్కడ మంచి సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిఫారసుతోనే ఆయనకు బీజేపీలో జాతీయ కార్యదర్శి హోదా దక్కింది. ఆయన సమర్ధత విషయంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సంతృప్తికరంగా ఉన్నాయి. అందుకే అదే ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌ నుంచి జాతీయ అధ్యక్ష పదవికి మంచి పోటీ ఉన్నప్పటికీ సౌత్‌ కే ప్రాధాన్యత ఇస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశం రామ్‌మాధవ్‌కు కలిసిరాగా పైగా ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్తి మద్దతు ఉండడం కలిసొచ్చే అంశంగా మారింది.. 


Also Read: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత


జాతీయ కార్యదర్శిగా తన ముద్ర..
ఆర్‌ఎస్‌ఎస్లో కీలక నేతగా ఎదిగిన రామ్‌మాధవ్‌ 2014లో బీజేపీలో సభ్యత్వం తీసుకున్న క్రమంలోనే ఆయనకు జాతీయ కార్యదర్శి హోదా లభించింది. బీజేపీను ఈశాన్య భారత దేశంలో విస్తరించడంతోపాటు ప్రాంతీయ పార్టీలతో జతకట్టి మరింత బలోపేతం చేయడంలో రామ్‌మాధవ్‌ పాత్ర కీలకమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అదేవిధంగా ఆయన పుట్టిన ప్రాంతం అయిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ బలోపేతానికి ఆయన విశేష కృషిచేశారు. ముఖ్యంగా పుట్టి పెరిగిన అమలాపురం అంటే ఆయనకు ఎంతో ఇష్టం కాగా కోనసీమ రైలు ప్రాజెక్టు ముందుకు కదలే విషయంలో ఆయన పాత్ర కీలకంగా ఉందని చెబుతుంటారు. 


ఇదీ రామ్‌మాధవ్‌ బ్యాక్‌గ్రౌండ్....
అమలాపురం పట్టణానికి చెందిన వారణాసి రామ్‌ మాధవ్‌ పుట్టి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అమలాపురంలోనే జరిగింది. ఆతరువాత ఏపీలోనే ఎలక్ట్రికల్‌ డిప్లొమా చేసిన తరువాత మైసూర్‌ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పొందారు. తండ్రి, తల్లి ద్వారా బాల్యం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని అణువణువునా నింపుకున్న రామ్‌మాధవ్‌ 1981 లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. తొలినాళ్లలో ప్రచారక్‌గా పని చేసిన ఆయన ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నుంచి 2014 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. ఆ తరువాత 2014లో బీజేపీ సభ్యత్వం తీసుకున్న రామ్‌మాధవ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో జాతీయ కార్యదర్శి హోదా పొందారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు కీలకంగా వ్యవహరించిన రామ్‌మాధవ్‌ 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ద్వారా బీజేజీ టీడీపీ, జనసేన పార్టీలకు ఏకంచేయడంలో కీలకంగా వ్యవహరించానే టాక్ ఉంది. 


Also Read: రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి