East Godavari YSRCP : అయిదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీలో హవా కొనసాగించిన  ఆపార్టీ సీనియర్‌ నేతలు ఎందుకు ప్రస్తుత వైసీపీ నిరసనల్లో పత్తాలేకుండా పోతున్నారు. పదవులు అనుభవించిన వారంతా చాలా దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పూర్తి నిస్తేజంలోకి వెళ్లిపోయారా.. అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఒక్కసారి సైలెంట్ అయిపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో కేవలం పదవులే అనుభవించాం.. కానీ దాని ద్వారా అనుకున్నంత స్థాయిలో ఫలాల్ని అనుభవించలేకపోయాం.. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కదా అప్పుడు చూద్దాంలే అనుకునేటట్లు వారి వ్యవహార శైలి కనిపిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన పలు నిరసన కార్యక్రమాల్లో పార్టీ సీనియర్‌ నేతలు మచ్చుకైనా కనిపించలేదు. అసలు వారు నియోజకవర్గాల్లోనే ఉండడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాకికాడలో వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో మాత్ర సీనియర్‌ నేతలంతా కనిపించినప్పటికీ పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాలకు మాత్రం డుమ్మాకొడుతున్నారు. దీనికి ఓటమి నిస్తేజం ఓ పక్క.. కేసులు భయం మరోపక్క కారణంగా అయ్యి ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 


ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇదీ పరిస్థితి..


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మొట్టమొదటిగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు జక్కంపూడి రాజా. రాజాకు మాజీ ఎంపీ, రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ మార్గాని భరత్‌కు మధ్య ఏమాత్రం పొసగడం లేదు.  అందుకే ఆయన ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహిస్తోన్న పలు కార్యక్రమాలకు జక్కంపూడి రాజా గైర్హాజరు అవుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన సోదరుడు, వైసీపీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్‌ అయితే మొత్తానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.


కొవ్వూరులో మాజీ మంత్రి తానేటి వనిత కూడా అన్ని కార్యక్రమాలకు హాజరుకాని పరిస్థితి కనిపిస్తోంది. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీచేసిన గూడూరి శ్రీనివాసులు కూడా పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడంలేదు.


కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు.. వైసీపీ తలపెట్టిన దాదాపు అన్ని కార్యక్రమాలకు హాజరు కాలేకపోయిన ద్వారంపూడి గత సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు మాత్రం హాజరు అయ్యారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా వైసీపీ తపెట్టిన దాదాపు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి కారణంగా తనతండ్రి అనారోగ్య కారణం వల్ల దూరంగా ఉంటున్నారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరో మంత్రి దాడిశెట్టి రాజా అయితే అన్ని కార్యక్రమాలకు అందుబాటులో ఉంటూ పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు..


కోనసీమలో దూరంగా సీనియర్లు..


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు పార్టీ సీనియర్లు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. రామచంద్రపురం నియోజకవర్గ బాధ్యతలు సుభాష్‌చంద్రబోస్‌ తనయుడు సూర్యప్రకాశరావుకు అప్పగించడంతో అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు బోస్‌ దూరంగా ఉండడం కనిపిస్తోంది. ఆయన ఇటీవల వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే కేవలం ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడే వచ్చి ఆపై హైదరాబాద్‌లో ఉండడంతో అధిష్టానం జిల్లా అధ్యక్ష బాధ్యతలు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి అప్పగించింది. ఆయన ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కలెక్టరేట్‌ వద్ద మూడు కార్యక్రమాలు జరిగాయి. వీటికి విశ్వరూప్‌ హాజరుకాలేదు. ఇక ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన పొన్నాడ సతీష్‌ కూడా దాదాపు ఏ కార్యక్రమానికి హాజరుకాలేదు. సోమవారం నిరుద్యోగ యువత పోరుబాట కార్యక్రమానికి మాత్రం హాజరు అయ్యారు. అది కూడా మొక్కుబడిగా కనిపించి వెళ్లిపోయారని పలువురు చెబుతున్నారు.  


ఉత్సాహంగా పాల్గొంటున్న కొత్త నాయకులు


పలు నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆ నియోజకవర్గాల కన్వీనర్లుగా కొనసాగుతున్న వారు పార్టీ చేపడుతున్న పలు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పి.గన్నవరం నియోజకవర్గానికి అయినవిల్లి జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావును కన్వీనర్‌గా అధిష్టానం నియమించగా దాదాపు అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గంటున్నారు. అమలాపురంలో మాజీమంత్రి విశ్వరూప్‌ స్థానంలో ఆయన కుమారుడు డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ను నియమించింది. దీంతో ఆయన పూర్తిగా యాక్టివ్‌ అయ్యారు. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాశరావు ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమి చెందారు. ఆయన రామచంద్రపురం నియోజకవర్గంలో చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.