Akhanda Godavari: 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రిని డెవలప్ చేసేందుకు దాదాపు 95 కోట్లతో టూరిజం శాఖ అభివృద్ధి పనులు చేపట్టింది. దీనికి కేంద్ర సహాయం కూడా లభిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా రాజమండ్రిలో దీనికి శంకుస్థాపన చేశారు. ఇంతకూ అఖండ గోదారి ప్రాజెక్టు అంటే ఏమిటి? రాజమండ్రిలో ఏ ఏ ప్రాంతాల అభివృద్ధి చేస్తారు.. ఇప్పుడు చూద్దాం..!
ఆధ్యాత్మిక కేంద్రం గా రాజమండ్రి పుష్కర్ ఘాట్ :
రాజమండ్రిలోని గోదావరి తీరానికి పుష్కర్ ఘాట్ అనేది ఒక ఐకాన్ గా మారిపోయింది. ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమమైనా పుష్కర్ ఘాట్ లోనే జరగుతోంది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి పుష్కర్ ఘాట్ శాశ్వత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చనున్నారు.
టూరిజం ఎట్రాక్షన్ గా హేవలాక్ బ్రిడ్జి
చారిత్రక నగరంగా పేరొందిన రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర గలిగి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రతిష్టాత్మక హేవలాక్ వంతెన పునర్నిర్మించనున్నారు.
దీన్ని ఒక మల్టీ ఫంక్షనల్ టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు వేదికగా దీన్ని మార్చేస్తారు. 2.7 కి.మీ ల పొడవైన వంతెనపై ఒక్కొక్కటి 48 మీటర్ల విస్తీర్ణంలో 57 స్పాన్‌లు ఉన్నాయి.. వీటిలో 18 స్పాన్‌లను అభివృద్ధి చేస్తారు.
• హేవలాక్ వంతెన ప్రాంతంలో జలపాతాలు, గ్లాస్ వంతెనలు, గేమింగ్ జోన్, స్పేస్ థీమ్, అర్బన్ హాట్ క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హాలోగ్రామ్ జూ, టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, ఆక్వేరియం టన్నెల్ లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నారు.
జలపాతాలు ఏర్పాటు
• 100 మీటర్ల విస్తీర్ణంలో ఆకర్షణీయమైన జలపాతాలు, వాటర్ స్ప్రేలు, నీటి మీద తేలుతూ ప్రయాణించేలా వినూత్నమైన క్యాస్కేడింగ్ ఫౌంటెన్ డిజైన్లు, లైట్ అండ్ సౌండ్ షోలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులకు మధురమైన అనుభూతిని కల్పించనున్నారు.
విదేశాల తరహా గాజు వంతెన:
100 మీటర్ల గాజు వంతెన ఏర్పాటు చేసి పర్యాటకులకు పగిలిన గాజుపై నడిచే అనుభూతిని అందించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటకుల భద్రతతో పాటు వారు మంచి అనుభూతికి లోనయ్యేలా గాజు వంతెనను తీర్చిదిద్దనున్నారు
గేమింగ్ జోన్ :
• ట్రెజర్ హంట్స్, వీడియో గేమ్ లు, ఇంటరాక్టివ్ ఫన్ వంటి కార్యక్రమాలతో అన్ని వయస్సుల వారు ఆనందంగా గడిపేలా 100-మీటర్లలో గేమింగ్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడిపులా, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్టు దుర్గేష్ అన్నారు.
స్పేస్ థీమ్ తో ప్లానిటోరియం
• భారతదేశ అంతరిక్ష విజయాల నుంచి ప్రేరణ పొందిన అంతరిక్ష పరిశోధన నేపథ్య ప్రాంతంగా ప్లానిటోరియం స్పేస్ థీమ్ ఉండనుంది. తద్వారా సందర్శకులు సున్నా గురుత్వాకర్షణను అనుభూతి పొందడం, నక్షత్రరాశులను అన్వేషించడం, విశ్వం గురించి తెలుసుకోవడం వంటి అంశాలు నేర్చుకునేందుకు వీలు కలుగుతుంది. అంతేగాక అంతరిక్ష ఔత్సాహికులకు ఇది విద్యాపరమైన జ్ఞానాన్ని అందించేందుకు అవకాశం ఉంది .
అర్బన్ హ్యాట్ క్రాఫ్ట్ బజార్ :
• ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పేలా రంగు రంగులతో కూడిన సుమారు 100 స్టాల్స్ తో క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేయనున్నాం. తద్వారా పర్యాటకులకు స్థానిక కళలు, హస్తకళలు, సాంప్రదాయ వంటకాలు, సంగీతంతోపాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేలా మరుపురాని వినోదం అందించనున్నారు
హ్యాంగింగ్ గార్డెన్స్:
వివిధ రకాల వృక్ష జాతులను ప్రదర్శించే కడియం నర్సరీల నుంచి ప్రేరణ పొంది హ్యాంగింగ్ గార్డెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక మంత్రి దుర్గేష్ అన్నారు. తద్వారా సందర్శకులు బొటానికల్ నైపుణ్యాలను అన్వేషించడంతోపాటు ఉద్యానవనాల పెంపకం గురించి తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. అంతేగాక ప్రకృతితో పర్యాటకులు మమేకం అవుతారు.
హాలోగ్రామ్ జూ:
హోలోగ్రామ్ సాంకేతికతను ఉపయోగించి వన్యప్రాణులను ప్రదర్శించే విధంగా హాలోగ్రామ్ జూను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల వందల జంతుజాతులను వర్చువల్ విధానంలో చూసేలా, సంభాషించేలా అనుభూతిని అందిస్తుంది. జీవుల పరిణామ క్రమం, జంతువులు సజీవంగా ఉన్నట్లు ప్రతిబింబించేలా జూ ఏర్పాటు కానుంది.
టైమ్ ట్రావెల్:
సమయ ప్రయాణాన్ని అన్వేషించేలా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI-ఆధారిత థీమ్ ను సందర్శకులకు అందుబాటులోకి రానుంది. తద్వారా పర్యాటకులు భవిష్యత్ కాలాన్ని సందర్శించేలా, విభిన్న కాలాల్లో ప్రయాణం చేస్తున్నట్లు అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
రైల్ మ్యూజియం:
సందర్శకులకు భారతీయ రైల్వే చరిత్రను తెలిపేలా రైల్ మ్యూజియం అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా రైల్వే ప్రాముఖ్యత, రైల్ ప్రయాణం, సాంకేతిక పురోగతితో రైల్వేలో వచ్చిన పురోగతి, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవచ్చును.
అక్వేరియం టన్నెల్:
అక్వేరియం టన్నెల్ ఏర్పాటు ద్వారా సందర్శకులు పారదర్శకంగా ఉండే టన్నెల్ గుండా ప్రయాణించి లైటింగ్, సౌండ్ తో కూడిన నిర్మలమైన వాతావరణంలో సముద్ర జీవనాన్ని అనుభూతి చెందేందుకు చర్యలు తీసుకోనున్నారు
మరిన్ని ప్రత్యేకతలు:
ఈ థీమాటిక్ జోన్‌లకు ఆనుకుని సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను అందించేలా 10 బఫర్ స్పేస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రధానంగా ప్రతి బఫర్ జోన్ లో 10 స్టాల్స్ తో ఉండేలా 5 ప్రత్యేకమైన ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. అక్కడ స్థానికంగా ప్రఖ్యాతి పొందిన వంటకాలతో పాటు అంతర్జాతీయ వంటకాలు అందుబాటులో ఉంచుతారు.
పర్యాటకులు విశ్రాంతి తీసుకునేలా సీటింగ్ ప్రాంతాలు, రెస్ట్ రూమ్ లతోపాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు
కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడిపేలా టాయ్ ట్రైన్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు
సందర్శకులకు చిరకాలం గుర్తుండేలా సెల్ఫీ పాయింట్ లు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఫోటోలు దిగేందుకు ఆసక్తి ఉండే వారికి జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు ఉపయోగపడనున్నాయి.
అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి:
• హేవలాక్ వంతెన, పుష్కర్ ఘాట్ అనుసంధానం• పుష్కర్ ఘాట్ ను గోదావరి హారతికి, పవిత్ర స్నానాలకు ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం స్నానాలు చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అక్కడ ఎలాంటి అధ్యాత్మిక వాతావరణం లేదు. అఖండ గోదావరి ప్రాజెక్టు అమలు చేసిన అనంతరం ప్రపంచ స్థాయి వసతులు కల్పించి అధ్యాత్మిక వాతావరణం కల్పిస్తాం అంటుంది కూటమి ప్రభుత్వం. ఏడాది పొడవునా యాత్రికులు పుష్కర్ ఘాట్ లో స్నానమాచరించేలా ఏర్పాట్లు చేస్తారు.
గోదావరి నది వెంట ఘాట్ లకు వెళ్లేలా బ్రిడ్జి లంక వద్ద బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తారు.
టూరిజం స్పాట్ గా కడియం నర్సరీ:
• భారతదేశపు అతి పెద్ద నర్సరీలో ఒకటైన కడియం నర్సరీకి గోదావరి కాలువ వంటి చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు
• అరుదైన మొక్కలు దొరికే ప్రదేశంగా, పూల తోటలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీకి అందమైన ముఖ ద్వారం, అంతర్గత రోడ్లు, అదనపు హంగులు జోడించి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
• ప్రాంతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కడియంలో బోటింగ్‌తోపాటు బండ్ అభివృద్ధి చేయనున్నారు. కడియపులంక, పొట్టిలంక, చుట్టుపక్కల నర్సరీల చుట్టూ పర్యావరణ అనుకూల పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు
• రాష్ట్ర పర్యాటక శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్ లను తీర్చి ఆర్థికంగా వృద్ధిని చేకూర్చే లక్ష్యంతో రాజమహేంద్రవరాన్ని ప్రాంతీయ పర్యాటక కేంద్రంగా, ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ గా ప్రమోట్ చేయాలనేది కూటమి ఆలోచన.
గోదావరి కాలువ అభివృద్ధి
భారతదేశంలో రెండో పొడవైన నదిగా పేరుగాంచడంతోపాటు రాజమహేంద్రవరానికి జీవనాడి అయిన గోదావరి కాలువను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు
గోదావరి చుట్టు ప్రక్కల పర్యాటకులు ఆహ్లాదంగా సేదతీరేలా, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా, కాలువలో పడవపై షికారు చేసే విధంగా తీర్చిదిద్దనున్నట్టు కందుల దుర్గేష్ తెలిపారు.
సమిశ్రగూడెం గోదావరి కాలువ:
నిడదవోలు మండలంలో సుందరమైన అందాలకు ప్రసిద్ధి చెంది అనేక ప్రాంతాలను కలిపేలా 23 కి.మీల పొడవైన సమిశ్రగూడెం గోదావరి కాలువను అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పునరాభివృద్ధి చేయనున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా 3.12 మైళ్ల మేర సుందరంగా తీర్చిదిద్దనున్నారు
టూరిజం సర్క్యూట్ లో భాగంగా గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ ప్రాంతంలో స్థానికంగా వినోదాన్ని అందించే సౌకర్యాలు, ఫుడ్ కోర్టు, సేద తీరేలా విశ్రాంతి గదులు ఏర్పాటు చేసి పర్యాటక కళ తీసుకురానున్నారు తద్వారా పర్యాటకులు గ్రామీణ సంస్కృతిని, సాంప్రదాయ పండుగలు, ప్రకృతి సౌందర్యాన్ని అన్వేషించవచ్చు. ఈ ప్రోత్సాహంతో స్థానికంగా ఆర్థిక వృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్టు మంత్రి అన్నారు.
పర్యాటక కేంద్రంగా నిడదవోలు:
విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగి, అద్భుతమైన ప్రాకారాలు, ఆకట్టుకునే ముఖ ద్వారం, ఎత్తైన రాజగోపురంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో అలరారుతున్న ప్రముఖ మహిమాన్విత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్తమ్మ దేవాలయాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా అదనపు యాత్రికుల వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ రాజగోపురం ఆధునికీకరించనున్నారు.
ఏటా రూ.2 కోట్ల ఆదాయం, పుష్కలంగా భూమి లభ్యత ఉన్న కోటసత్తెమ్మ ఆలయాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా కాలువ కట్టతోపాటు బోటింగ్ ఏర్పాటు చేసి మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు
లక్షలా మంది భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచి శంఖు చక్ర గధ అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయం భూవిగ్రహంతో అలరారుతున్న త్రిశక్తి స్వరూపిణి కోట సత్తెమ్మ తల్లి ఆలయంలో ఆధ్యాత్మికతను మెరుగుపరించేందుకు ఆలయ ఆవరణాన్ని అభివృద్ధి చేసి ఆలయంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నామనీ.. సాంస్కృతిక ప్రదేశంగా తీర్చిదిద్ది దూరప్రాంత యాత్రికులను సైతం ఆకర్షించి పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామనీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఉపాధి అవకాశాల పెంపు
అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ వంతెన, బ్రిడ్జ్ లంక ద్వీపం, పుష్కర్ ఘాట్ మరియు రివర్ ఫ్రంట్ ద్వారా నిర్వహణ, ఆతిథ్యం, విద్య మరియు సాంస్కృతిక రంగాలలో దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 3200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయనీ. జీవనోపాధి కలగనుందనీ కందుల దుర్గేష్ అన్నారు.ప్రధానంగా టూరిస్ట్ గైడ్ లు, పూజారులు, స్పా థెరపిస్ట్, ఈవెంట్ కోఆర్టినేటర్లు తదితర ఉద్యోగాల కల్పన జరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.