రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శంకుస్థాపన చేశారు. గురువారం ఉదయం జరిగిన సైన్స్ కేంద్రం ప్రారంభం, ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌, బీజేపీ ఎంపీ పురందేశ్వరి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్‌ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో కేంద్రంతో కలిసి కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టింది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా చారిత్రక నగరం రాజమహేంద్రవరంను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేంద్రం నిధులు రూ. 375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది తీరం. ఇలాంటి చోట నాగరికత, భాష ఉంటాయి. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జన్మించిన నేల. ఆదికవి నన్నయకు జన్మనిచ్చిన నేల. బాపు రమణల్లో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ సహా ఎంతో సాహితీవేత్తలు, ప్రముఖులు పుట్టిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని భావించాం. రూ.430 కోట్లతో ఈరోజు మొత్తం 7 ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ముఖ్యమైనది అఖండ గోదావరి ప్రాజెక్టు. 

2024 ఎన్నికల సమయలో కూటమి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని చెప్పింది. పర్యాటక రంగంలో 800 మందికి ఉపాధి దొరుకుతుంది. అన్ని ప్రాజెక్టులు, పనులు పూర్తయితే ఏడాదికి 4 లక్షల మంది పర్యాటకులు వస్తారు. ఎంపీ పురంధేశ్వరి చెప్పినట్లు డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి చెప్పారు. సీసీ పవర్ ఎక్కువుంటే బండి అంత ముందుకు వెళ్తుంది. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ మన ప్రభుత్వం ఉంటే పనులు వేగంగా, అనుకున్నట్లుగా జరుగుతాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అర్థం ఇదే. 

35 లక్షల మందిని ఆకర్షించేలా అఖండ గోదావరి ప్రాజెక్టు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా జల్ శక్తి మంత్రిగా ఉండి కూడా బీజాలు వేసింది కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావల్. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి సైతం ఆయన సహకరించారు. ఏపీకి కావాల్సిన సాయం చేయడానికి కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అఖండ గోదావరి హేవ్ లాక్ వంతెన (Havelock Bridge). 970 కిలోమీటర్ల తీరం ఏపీకి ఉంది. మిగతా దేశాల్లో ఇలాంటి ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేస్తారు. కానీ మనం నదిని జీవనంలో, సంస్కృతిలో భాగంగా చూస్తాం. పుష్కర ఘాట్లలో మన సంస్కృతి, కళలకు సంబంధించి షాపులు పెడతారు. కందుల దుర్గేశ్ నాయకత్వంలో టూరిజం డెవలప్ అవుతుంది. కేంద్రం సహకారంతో 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా అఖండ గోదావరి ప్రాజెక్టును తీర్చిదిద్దుతాం. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఈ ప్రాజెక్టును గొప్పగా ముందుకు తీసుకెళ్లినందకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. వీరులు పుట్టిన రాజస్తాన్ గడ్డ నుంచి వచ్చారు గజేంద్ర సింగ్ షేకావత్. అలాంటి పౌరుషం ఉన్న గడ్డ నుంచి వచ్చిన ఆయనకు అలాంటి వీరత్వం ఉన్న ఏపీ గురించి బాగా అర్థమవుతుందని’ పవన్ కళ్యాణ్ అన్నారు.

అంతకుముందు ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటిక్రితం రాజమహేంద్రవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జనసేన, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా పుష్కర ఘాట్ కు చేరుకుని అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.