Tirumala Express: ఉత్తరాంధ్ర ప్రజలకు తిరుపతి వెళ్లాలంటే వెంటనే గుర్తు వచ్చే ట్రైన్ తిరుమల ఎక్స్ ప్రెస్. ప్రతీ రోజూ వైజాగ్ నుంచి తిరుపతి వెళ్లే ఈ ట్రైన్ ను ఆ మధ్య కడప వరకూ పొడిగించారు. దానితో కడప నుంచి వైజాగ్ కు డైరెక్ట్ ట్రైన్ వచ్చినట్టు అయ్యింది. కానీ ఇప్పుడు ఆ ట్రైన్ ను గుంతకల్ వరకూ పొడిగించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది...! దీన్ని గమనించక పోతే ప్రయాణికులు నష్టపోతారు.
కడప నుంచి గుంతకల్ వరకూ వేరే పేరుతో...!
18521 నెంబర్ తో ప్రయాణించే తిరుమల ఎక్స్ ప్రెస్ వైజాగ్ లో ప్రతీ రోజూ మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి,నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, నెల్లూరు మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు తెల్లవారుజామున 4:30కి తిరుపతి చేరుకుంటుంది. అక్కడ ఉదయం 5 గంటలకు బయలుదేరి రేణిగుంట, కోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా వెళుతూ ఉదయం 7:25కి కడప చేరుకుంటుంది.
కొత్తగా రైల్వే తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇదే ట్రైన్ 07521 నెంబర్‌తో కడపలో ఉదయం 7:45కి బయలుదేరి ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి మీదుగా 11:15కి గుంతకల్ జంక్షన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంతకల్‌లో 07522 నెంబర్‌తో మధ్యాహ్నం 1:30కి బయలుదేరి సాయంత్రం 5:15 కి కడప చేరుకొని అక్కడి నుంచి తిరుమల ఎక్స్ ప్రెస్ పేరుతో 5:40 కి బయలుదేరి రాత్రి 8:20కి తిరుపతి మరుసటి రోజు ఉదయం 11:30 కి విశాఖపట్నం చేరుకుంటుంది.
కడప నుంచి గుంతకల్ వరకూ అన్నీ జనరల్ టికెట్స్ నే
కడప వరకూ తిరుమల ఎక్స్ప్రెస్ గా చేరుకునే ఈ రైలు అక్కడి నుంచి గుంతకల్ వరకూ వేరే నెంబర్ తో కేవలం జనరల్ బోగీలతోనే ప్రయాణిస్తుంది. కేవలం జనరల్ టికెట్స్ తోనే స్లీపర్ బోగీల్లో సైతం ప్రయాణం చేయవచ్చు. కడప-గుంతకల్ మధ్య ఈ ట్రైన్ లోని ఏసీ బోగీలకు లాక్ వేసేస్తారు. ట్రైన్ క్లీనింగ్ తో పాటు వాటర్ నింపుకునే సౌకర్యం గుంతకల్ స్టేషన్ లో ఉండడం తో తిరుమల ను ఇలా గుంతకల్ వరకూ పొడిగించారు. కాబట్టి ఎవరైనా ప్రయాణికులు వైజాగ్ ప్రాంతాల నుంచి తిరుపతి, కడప మీదుగా గుంతకల్ వెళ్లాలంటే డైరెక్ట్ టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు.