Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యింది. ఈ ఏడాదిలో సాధించిన విజయాలు, ప్రజలకు చేసిన సర్వీస్‌, రాష్ట్రానికి జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన కార్యచరణ రూపొందించేందుకు ఇవాళ సాయంత్రం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. 

'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు ఎలాంటి విషయాలపై క్లారిటీ ఇవ్వాలి. ఇంకా అమలు చేయాల్సిన హామీలపై ఎలా స్పందించాలి. ఏడాదిలో రాష్ట్రంలో వచ్చిన మార్పులు ఇలా ప్రతి అంశంపై ప్రజప్రతినిధులు అవగాహన తెచ్చుకునేలా ఈ సమావేశం ఉంటుందని అంటున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ప్రత్యేకంగా నిర్మించిన వేదిక వద్ద ఈ భేటీ జరగనుంది. 

ఏడాది పాలనపై ప్రొగ్రెస్ రిపోర్టును భారీ బహిరంగ సభతో గ్రాండ్‌గా ప్రజల ముందు పెట్టాలనే ఏపీ ప్రభుత్వం ఆలోచించింది. కానీ అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం వాళ్ల ప్లాన్‌ను పూర్తిగా మార్చేసింది. 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో నేరుగా ప్రజల వద్దకే వెళ్లాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులను ట్రైన్ చేయనున్నారు. ఆ దిశగా ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. 

26 జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, హెచ్‌ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు నుంచి ఒకచోటకు చేరనున్నారు. ఏడాది పాటు జరిగిన పాలనలో పురోగతి, అభివృద్ధి విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలపై చర్చలు జరపనున్నారు. గతేడాది చేపట్టిన కీలక సంక్షేమ కార్యక్రమాలు, విధానపరమైన నిర్ణయాలు, సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి మాట్లాడనున్నారు. రాబోయే నాలుగు సంవత్సరాలకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నారు. 

అంతే కాకుండా ప్రతిష్టాత్మకమైన స్వర్ణ ఆంధ్ర @2047 ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా కీలక ప్రతిపాదలు సిద్ధం చేయనున్నారు. గత ఐదేళ్ల పాలనలో తగిలిన ఎదురుదెబ్బలు తట్టుకొని రాష్ట్ర ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక పురోభివృద్ధికి బాటులు వేసేలా సంకీర్ణ ప్రభుత్వం దార్శనికతతో చర్యలు తీసుకుంటోందని చాటిచెప్పనున్నారు. పోలవరం, అమరావతి పునరుద్ధరణ, పెట్టుబడి ప్రోత్సాహం, ఉపాధి కల్పనతో సహా వివిధ రంగాల్లో సాధించిన విజయాలు హైలైట్ చేసే నివేదిక ఈ సమావేశంలో పెట్టనున్నారు. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడం అనేవి కీలకమైన అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు.