Weather Latest News : ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి జోరువానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీర దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని చెబుతోంది. 


ఒడిషా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలకు అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఇది పూరి సమీపంలో కళింగపట్నానికి సుమారు 200 కిలోమీటర్లకుపైగా దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తీరం దాటే ఛాన్స్ ఉంది. ఈ వాయుగుండం ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 24 గంటల్లో బలహీనపడుతుంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. 


మరోవైపు రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం కూడా వాతావరణంపై ఉంది. జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, రాయ్పూర్, పూరీ మీదుగా వెళ్తున్న ద్రోణీ ఆగ్నేయ దిశగా ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరాలుపై ప్రభావం చూపిస్తుంది. 


వర్షాలు జోరుగా పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు... ప్రతి జిల్లాలో ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటి మట్టం గంట గంటలకు పెరుగుతూనే ఉంది. శబరి, మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, మానేరు, పర్ల, ప్రవర ఇలా అన్ని ఉపనదులు కూడా ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరికి వరద నీరు పోటెత్తడంతో పోలవరం వద్ద స్పిల్‌వే మూడు లక్షల 30 వేలక్యూసెక్కులపైగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 36.5 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. 


పోలవరం వద్ద ఉన్న గండిపోశమ్మ ఆలయం నీట మునిగింది. దీంతో ఆ ఆలయానికి భక్తుల రాకపోకలను అధికారులు నిలిపేశారు. దవళేశ్వరం వద్ద కూడా నీటి మట్టం భారీగా పెరిగింది. నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా వరద నీరు పెరగడంతో ముంపు ప్రాంతాలు భయం గుప్పెట్లో బతుకుతున్నాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏటా వరదలు రావడం ఇక్కడ లంక గ్రామాలు మునిగిపోవడం సర్వసాధారణమైపోయింది. 


శ్రీశైలజలాశయానికి వరదపోటు -
2024-25 ఏడాది వర్షాకాల సీజన్‌లో శ్రీశైల జలాశయానికి వరద పోటు మొదలైంది. మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణానది ఎగువ పరివాహకంలోని ఆలమట్టి, నారాయణాపూర్, జూరాల డ్యాంలు నిండి నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరడంతో వరదజాలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో జూరాల డ్యాం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైల జలాశయానికి నీటిని వదులుతున్నారు. దీంతో జూరాల నుంచి శ్రీశైలానికి 34,818 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.  శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80టీఎంసీలు. శుక్రవారం రాత్రి సమయానికి జూరాల నుంచి భారిగా 34,818 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం డ్యాం నీటిమట్టం 809.10అడుగులకు చేరగా జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 33.8136 టీఎంసీలుగా నమోదయింది