School Holidays In Konaseema District Due to heavy rains:  వర్షాల కారణంగా శనివారం కోనసీమ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆదివారం యధావిధిగా సెలవు ఉంటుంది, కనుక వర్షాల తీవ్రతను చూసి సోమవారం కూడా సెలవు ఉంటే ప్రకటిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు శుక్రవారం భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై పలు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అధికారులు ముందుగానే చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టం ఉండవని సీఎం చంద్రబాబు సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.


వరదల పట్ల అప్రమత్తంగా ఉన్నాం... కలెక్టర్ మహేష్ కుమార్


వరద సహాయక చర్యలు పర్యవేక్షణకు గాను 9 మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ నుంచి దిగువకు 2,80,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 45 జనావాస ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వీటిలో ప్రస్తుత నీటి ప్రవాహాన్ని గమనిస్తే మూడు లంక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉందన్నారు. పది లక్షల క్యూసెక్కులు ప్రవాహం దిగువకు విడుదల చేసినప్పుడు జనావాసాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు.


గజ ఈతగాళ్లు బోట్లు, లైఫ్ జాకెట్లు సిద్ధం 
ముంపు బారిన పడిన గ్రామాలలోని నిరాశ్రయులు, బాధితులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు గజ ఈతగాళ్లు బోట్లు, లైఫ్ జాకెట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర జలవనుల శాఖ అధికారులు గౌతమి వశిష్ఠ వైనతేయిలకు సంబంధించి 386 కిలోమీటర్లు ఏటిగట్టును గండ్లు పడకుండా నిత్యం పర్య వేక్షించేలా ఏర్పాట్లు చేశారు. కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రంలో భారీ వర్షాలు, వరద సహాయక చర్యలు చేపట్టేందుకుగానూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జులై 20వ తేదీన భారీ వర్షాలు ఉన్నాయని, గోదావరి వరదలు కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు వరదలు వస్తే ముంపు తీవ్రత పెరగవచ్చునని, అందుకోసం అధికారులను అప్రమత్తం చేసినట్లు స్పష్టం చేశారు.


మేజర్ కాలువలు, స్లూయిస్ అవుట్ పాల్స్ లాక్ ల ద్వారా, వరద నీరు సవ్యంగా పారేలా మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. పి గన్నవరం ఐ. పోలవరం అక్విడెట్లు ద్వారా వరద నీరు దిగువకు పారేలా చర్యలు తీసుకుంటున్నారు. వరద ముంపు బాధితుల తరలింపునకు పేర్రి పాయింట్ల వద్ద లైఫ్ జాకెట్లు బోట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NDRF) బృందాన్ని కూడా వరద సహాయక చర్యలు నిమిత్తం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే వరద సహాయక చర్యల నిమిత్తం జిల్లా స్థాయి అధికారులను నియమించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టేందుకు మండలాలకు పంపినట్లు తెలిపారు.
Also Read: AP Rains: వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశాలు