AP CM Chandrababu Review on Rains, Floods |

  అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోనూ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో జలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు శుక్రవారం నాడు సమీక్షించారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్షించారు. 


భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అన్నారు. ముందస్తు ప్రణాళికతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 185 మిల్లీమీటర్ల నుంచి 244 మిల్లీమీటర్లుగా నమోదైంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా గమనిస్తే 31 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున ముఖ్యంగా చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. 


అక్రమ తవ్వకాల కారణంగా గోదావరి కట్టలు బలహీనం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జరిపాలరని సీఎం చంద్రబాబు అన్నారు. అక్రమ తవ్వకాల కారణంగా గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, వీటిపై దృష్టిపెట్టాలని లేకపోతే వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయని సూచించారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఫ్లడ్ మాన్యువల్ ద్వారా సకాలంలో నిర్ణయాలు తీసుకోవాల్నారు. విపత్తులు వచ్చినప్పుడే ప్రభుత్వంతో పాటు అధికారుల పనితీరు, సమర్థత బయటపడుతుందని పేర్కొన్నారు. 


అప్రమత్తంగా ఉండాలి, డైనమిక్‌గా పనిచేయాలన్న చంద్రబాబు 
అసలే వర్షాకాలం, భారీ వర్షాలు మొదలుకావడంతో అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్ గా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వర్షాలు, వరదలు వచ్చిన తరువాత చర్యలు చేపట్టడానికి బదులుగా.. వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తమై చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలుగుతామని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఉన్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. గతంలో చేసిన వ్యవస్థలను రీ యాక్టివేట్ చేసి ప్రజలకు మేలు చేయాలన్నారు. సీఎం చంద్రబాబు వర్షాలు, వరదల పరిస్థితిపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొని పలు విషయాలు చర్చించారు.


Also Read: Rajahmundry Havelock Bridge: రాజమండ్రి హేవలాక్ వంతెనపై టూరిజం ప్రాజెక్ట్ - రూ. 120 కోట్లతో సన్నాహాలు ! 


Also Read: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.5 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలు