తరువాత మేం అధికారంలోకి వస్తాం, చేతులు కట్టుకుని కూర్చుంటామా.. అంటూ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫైర్‌ అయ్యారు. రాజమండ్రిలో అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె సోదరుడు ఎంపీ రామ్మోహన్‌ నాయుడును కలిసి సంఘీభావం తెలిపిన తరువాత అనిత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ నాయకుల వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా అని ఓపెన్‌ డిబేట్‌ పెడితే మీ వాలంటీర్లు, మీకు ఓటేసినవాళ్లు, మీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రులు మా వద్దకు క్యూ కడతారన్నారు. మీ బాధలు భరించలేక మాజీ మంత్రులే కన్నీరు పెట్టుకుంటున్నారని, మీ ఎమ్మెల్యేలే వద్దురా బాబు మీకో దన్నం అంటున్నారు. ఆఖరికి ప్రెసిడెంట్‌లు, మేయర్‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. టీడీపీ నాయకుల మీద అవినీతి మరక అంటించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, అయిన మహా అయితే మీరు జైలులో పెట్టించగలరని అంతకన్నా ఇంకే చేస్తారు అని వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.


కేసు అంటే కిరీటం వంటిదనుకుంటున్నాం..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసులంటే భయపడేవారేమో కానీ ఇప్పుడు కేసులు అంటే కిరీటం, రత్నం, వజ్రంలాంటిదని భావిస్తున్నామని, ఇంతకు మించి మీరు ఏమీ చేయలేరు అని అనిత అన్నారు. 30 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నాయకులమీద అవినీతి మరక అంటించేందుకు ప్రయత్నిస్తున్నారంటే మీమీద ఎంతటి ప్రజ్యావతిరేకత ఉందో అర్ధం చేసుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు.


కుక్క బ్రతుకు అయిపోవడమంటే ఇదేనేమో..
మొన్నటి వరకు జగనన్నే మా నమ్మకం అంటూ స్టిక్కర్లు అంటించారు. అవి కుక్కలు, కోతులు పీకేస్తున్నాయని, స్టిక్కర్లును కూడా కుక్కలు లాగేయడమంటే ఇదేనేమో, కుక్కలకు కూడా నచ్చడం లేదన్నారు. కుక్క బత్రుకు అయిపోవడమంటే ఇదేనేమోనని ఎద్దేవా చేశారు. మళ్లీ ఇప్పుడు జగనన్నకు చెబుదాం అంటూ సీఎం జగన్‌ రెడ్డి ఓఫోన్‌ పట్టుకుని టోల్‌ఫ్రీ నెంబర్‌ పెట్టుకునేకంటే జనాల వద్దకు వెళ్లేటప్పుడు పరదాలు లేకుండా వెళ్లాలని ఛాలెంజ్‌ విసిరారు. వాళ్ల డబ్బావాళ్లు కొట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. భక్త జన బృందం మాత్రం జగన్‌ను జాకీలేసి లేపుతున్నారన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసులతో ములాఖత్‌ అయ్యేందుకు జైలు వద్దకు మా నాయకుడు చంద్రబాబు వస్తే ములాఖత్‌కు పర్మిషన్‌ ఇచ్చినందుకు అర్ధరాత్రి గిరిజన సూపరింటెండెంట్‌ ను ఎందుకు బదిలీచేశారని ప్రశ్నించారు. వ్యవసాయశాఖ మంత్రిపై పరోక్ష విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీల దాడులు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి సైకో పాలన చేస్తున్నాడని విమర్శించారు.


అక్కడ రామోజీ, ఇక్కడ ఆదిరెడ్డిపై వేధింపులు..
ఓ మీడియా అధినేత రామోజీరావు గొప్ప వ్యక్తి అని, 30 ఏళ్లుగా లేని మచ్చలన్నీ జగన్మోహన్‌ రెడ్డికే కనిపిస్తున్నాయని అనిత సెటైర్లు వేశారు. అదేవిధంగా ఆదిరెడ్డి భవానీ కుటుంబంపై పడ్డారని, గత 30 ఏళ్లుగా వ్యాపారంలోనే కాదు, ప్రజా జీవితంలోనూ ఉన్నారు. ఒక్కఛాన్స్‌ వేవ్‌లో కూడా 30 వేలు మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. ఎవ్వరూ కంప్లైంట్‌ ఇవ్వకున్నా.. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని సీఐడీ పోలీసులను ఉపయోగించి సీఎం జగన్‌ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు అనిత.


కంప్లైంట్‌ లేకున్నా వేధిస్తున్నారు.. 
గత 25 ఏళ్లుగా ఆదిరెడ్డి కుటుంబం వ్యాపారం చేస్తోందని అయితే ఇప్పుడు ఎవ్వరూ కంప్లైంట్‌ ఇవ్వకున్నా సీఐడీ పోలీసులు ఇంటివరకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కనీసం సుమోటోగా తీసుకునేందుకు ఏదైనా పత్రికలోనూ, టీవీల్లోనూ వచ్చిందా.. కక్ష కట్టి సీఐడీ పోలీసులను పంపించి అరెస్ట్‌లు చేయాల్సిన అవసరం ఏముందని ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తున్నామని రాష్ట్రానికి ఇదేం కర్మ అన్నారు.