కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జీ రాగంపేటలోని అంబటి ఆయిల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వీళ్లంతా పాడేరు వాసులుగా గుర్తించారు. ఆయిల్ కంపెనీలో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిని క్రిష్ణ, నర్సింహ, సాగర్, బంజుబాబు, రామారావు, జగదీశ్, ప్రసాద్ గా గుర్తించారు. ఆయిల్ ఫ్యాక్టరీ ఏడాది క్రితమే ప్రారంభం అయింది. ఈ కార్మికులు 10 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరారు. 


ఎత్తుగా ఉన్న ఇనుప ఆయిల్ ట్యాంకులోకి దిగి కార్మికులు శుభ్రం చేస్తుండగా చనిపోయారు. వారిని బయటకు తీసేందుకు ట్యాంకు కింది భాగంలో పెద్ద రంద్రం చేసి బయటకు తీశారు. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం


ఆయిల్ ఫ్యాక్టరీ ట్యాంకర్ క్లీనింగ్ ఘటనలో కార్మికులు మృతి చెందడం పట్ల రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తరచూ పరిశ్రమల్లో  అనూహ్యంగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారులు వారికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరును సోము వీర్రాజు తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో  పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని, మంత్రులు ఎక్స్‌గ్రేషియాలు చెల్లిస్తూ కంటి తుడుపు చర్యగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడం వారి పనితీరుపై నిర్లక్ష్యం కనపడుతుందని తీవ్రంగా విమర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా తోపాటుగా ఆయా కుటుంబాలను ఆదుకునే శాశ్వత చర్యలు చేపట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.