DR. BR. Ambedkar Konaseema District News: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో హిందూ ఆలయాలే టార్గెట్‌గా కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఆలయాల్లో ఉండే బంగారు, వెండి వస్తువులు ఎత్తుకెళుతున్నారు. హుండీలను కూడా వదలడం లేదు. అందులో ఉన్న చిల్లర డబ్బలు పట్టించుకోకుండా కరెన్సీ ఉంటే మాత్రం తస్కరిస్తున్నారు. 


రెండు నెలల క్రితం అమలాపురం కిమ్స్‌ వెంకటేశ్వరస్వామి గుడిలో, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి భారీగా బంగారం, వెండి స్వాదీనం చేసుకున్నారు. అయితే గత వారం రోజులుగా అమలాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో చోరీలు జరిగాయి. 


మరోసారి ఆలయాల్లో జరుగుతున్న చోరీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ కేసులపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తును పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే దొంగతనాలు ఎలా జరిగాయన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ మాత్రం వెల్లడించలేదు. 


అంతరాష్ట్ర దొంగల ముఠా పనేనా...
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆధ్మాత్మికం అగ్ర భాగాన ఉంటుంది. ప్రతీ గ్రామంలోనూ ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామస్తులు లేదా విరాళాల ద్వారా సమర్పించిన బంగారు, వెండి వస్తువులు కూడా విగ్రహాలకు అలంకరించి ఉండడంతో ఇటీవల కాలంలో కోనసీమలోని ఆలయాలపై అంతరాష్ట్ర దొంగల ముఠా కన్ను పడినట్లు తెలుస్తోంది. జైల్లో ఏర్పడిన పరిచయాల ద్వారా స్థానికంగా ఎవరినైనా కలుపుకుని కోనసీమ జిల్లాలో ఆలయాలే టార్గెట్‌గా చెలరేగిపోతుందా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఆలయాల్లో దొంగతనాలు మాత్రం స్థానిక ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. 


అమలాపురం బులియన్‌ మార్కెట్‌లో చోరీ..
అమలాపురంలోని బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం ఓ మహిళకు చెందిన నగలున్న బ్యాగును లాక్కుని పరారయ్యాలు దుండగులు. పక్కా ప్లాన్‌ ప్రకారం ముగ్గురు ముఠా సభ్యులు ఆమె వెంట వెళ్లి బ్యాగును లాక్కుని ఉడాయించారు. ఈ చోరీ ఘటన సీసీ కెమెరాల పుటేజీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి..


దర్జాగా బైక్‌ దొంగతనాలు...
కోనసీమ జిల్లాలో ఇటీవల కాలంలో బైక్‌ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. .. ఫోర్క్‌ లాక్‌ వేసి ఉన్న బైక్‌లను సైతం మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. పార్కింగ్‌ చేసిన బైక్‌లను వారి సొంత బళ్లులాగానే దర్జాగా బండిపై కూర్చుని మారు తాళాలతో ఎత్తుకెళుతున్నారు. అమలాపురం పట్టణంలోనే ఓ షాపు దగ్గర పార్కు చేసిన బైక్‌ను ఇలానే కొట్టేశారు. ఈ సీసీ కెమెరా పుటేజీ వైరల్‌ అవుతుంది. ఓడలరేవు బీచ్‌ వద్ద, అయినవిల్లి, అంతర్వేది, వాడపాలెం ఇలా రద్దీగా ఉంటే ఆలయాల వద్ద పార్కుచేసిన బైక్‌లను అపహరిస్తున్నారు. 


ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం..
కోనసీమ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నామని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 


Also Read: రైలు కదులుతుండగా ఎక్కబోయాడు - ట్రైన్‌కు ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుపోయాడు, చివరకు!