Andhra Pradesh News: రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికలకు కలిసే వెళ్తామని ఇరు పార్టీల అధినాయకులు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి కార్యచరణల్లో భాగంగా నిర్వహిస్తోన్న ఆత్మీయ సమావేశాల్లో ఇరుపార్టీల నియోజకవర్గ ముఖ్యనేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఇదే తీరు కనిపించడంతో పైస్థాయిలో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.. ఇటీవల జరిగిన పిఠాపురం, జగ్గంపేట నియోజవర్గాల్లో ఇదే తీరు కనిపించడంతో రెండు పార్టీల కేడర్ అయోమయంలో పడినట్లయ్యింది. ఇక టీడీపీ, జనసేన పార్టీల్లో వర్గాలు ఆత్మీయ సమావేశాలకు డుమ్మాకొట్టి ఆపై తమను పిలవలేదని, తమకు అసలు సమాచారం లేదంటూ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశం అయ్యింది. ఇదే పరిస్థితి అమలాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీలో అంతర్గతంగా ఉన్న వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని బట్టబయలు చేసింది.
జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాల్లో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, రాజోలు తదితర నియోజకవర్గాల్లో పట్టుంది. ఇదే తరహాలో కాకినాడ జిల్లా పరిధిలో పిఠాపురం, జగ్గంపేట, కిర్లంపూడి, కాకినాడ రూరల్ తదితర నియోజకవర్గాల్లోనూ జనసేనకు కూడా పట్టుంది. అయితే ఈ నియోజకవర్గాల్లో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో టీడీపీ, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలోనే చోటుచేసుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేసే అవకాశాలున్న పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వర్మకు, జనసేన పార్టీ ఇంఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధమే నడిచినట్లయ్యింది.. గత ఎన్నికల్లో ఎంత అభివృద్ధి చేసినా ఓడిపోవాల్సి వచ్చింది, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని జనసేన ఇంఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ అనగానే దీనిపై కోపం తెచ్చుకున్న టీడీపీ ఇంఛార్జ్ వర్మ కౌంటర్ ఇచ్చారు. మీకు క్లారిటీ లేదు.. నాకు 70 వేల ఓట్లు వచ్చాయి. అతిరథ మహారధులే ఓడిపోయారు.. అంటూ వర్మ కౌంటర్ ఇవ్వడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడిరది. దీంతో జనసేన కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత ఉమ్మడి అభ్యర్ధిని గెలిపించుకుంటాం అని ఇరువురు ఇంఛార్జ్‌లు చెప్పుకురావడం కనిపించింది.
ఇదే తరహాలో జగ్గంపేట నియోజకవర్గంలోనూ కనిపించింది. ఇక్కడ జరిగిన ఆత్మీయ సమావేశంలో రసాభాస అయ్యింది.. కొన్ని రోజుల క్రితం గోకవరం మండలంలో రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ విషయంలో క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు కోరడంతో రెండు వర్గాలు బాహాబాహీకి తలపడే పరిస్థితి కనిపించింది. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో సీటు తమదేనని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అమలాపురంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన నుంచి ఆపార్టీ నాయకుడు డీఎమ్మార్ శేఖర్ వర్గం డుమ్మాకొట్టింది.. వరుసగా జరిగిన మూడు ఆత్మీయ సమావేశాల్లో మూడు సార్లు వివాదాలు చెలరేగడంతో ఆత్మీయ సమావేశం కాస్త అనైక్యరాగం ఎత్తుకోవడం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
కీలకమైన ఉమ్మడి గోదావరి నియోజకవర్గాల్లో తలెత్తిన పరిణామాలు టీడీపీ, జనసేన అధినాయకత్వం దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.