AP LAWCET 2023 Counselling Registration: ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ కళాశాల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 17 ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబరు 20 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయినవారికి నవంబరు 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన 21 సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు నవంబరు 23 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. నవంబరు 26న ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఆప్షన్లు ఫ్రీజ్ చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 28న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబరు 29 నుంచి 30లోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ రిజిస్ట్రేషన్: 17.11.2023 - 20.11.2023.
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 18.11.2023 - 22.11.2023.
➥ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్: 21.11.2023.
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 23.11.2023 - 25.11.2023.
➥ వెబ్‌ఆప్షన్లలో మార్పు: 26.11.2023.
➥ సీట్ల కేటాయింపు: 28.11.2023.
➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 29.11.2023 - 30.11.2023.
ఏపీలో న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 20న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 16న ఫలితాలను విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 16,203మంది హాజరు కాగా.. వారిలో 13,402 మంది క్వాలిఫై అయ్యారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.
* ఏపీలాసెట్/ పీజీఎల్‌సెట్ - 2023 వివరాలు..
1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు
- ఎల్‌ఎల్‌బీ
- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు
- బీఏ ఎల్‌ఎల్‌బీ
- బీకామ్ ఎల్‌ఎల్‌బీ
- బీబీఏ ఎల్‌ఎల్‌బీ
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
లాసెట్ పరీక్ష విధానం: మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-బి: కరెంట్ ఎఫైర్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-సి: ఆప్టిట్యూడ్ (స్టడీ ఆఫ్ లా) 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పార్ట్-సిలో బేసిక్ లా ప్రిన్సిపుల్స్, భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఐదేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 35 శాతం అంటే 42 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
పీజీఎల్‌సెట్ పరీక్ష విధానం: మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో మొత్తం 2 సెక్షన్లు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ నుంచి 40 పశ్నలు, పార్ట్-బి నుంచి 80 పశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను 25 శాతంగా (30 మార్కులు) నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు.