Satyavathi Rathod News In Telugu: మహబూబాబాద్: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ గూడూరు పోలీస్ స్టేషన్‌లో మంత్రిపై కేసు నమోదైంది. మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ (BRS Candidate Shankar Naik) కు మద్దతుగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆమెకు హారతి ఇచ్చారు. ఎంతగానో సంతోషించిన ఆమె, అందుకుగానూ వారికి హారతి పళ్లెంలో రూ.4 వేలు వేశారు. ఈ విషయం వివాదాస్పదమైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు ఇచ్చారని ఎఫ్‌ఎస్‌టీ టీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ పై గూడూరు పోలీసులు (Gudur Police) కేసు నమోదు చేశారు.
సాధారణ సమయంలో నేతలు ఏం చేసినా అంతగా పట్టించుకోరు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే చేసే ప్రతిపని ఆలోచించి చేయాల్సి ఉంటుంది. లేకపోతే కేసులతో చిక్కుల్లో పడతారు. కొన్ని సందర్భాలలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పదవి కోల్పోయిన నేతలూ ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. గూడూరు మండలలోని కొంగర గిద్దె గ్రామంలో పార్టీ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున ప్రచారానికి వెళ్లిన ఆమె అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ప్రచారానికి వచ్చిన సందర్భంగా కొందరు మహిళలు మంత్రి సత్యవతి రాథోడ్ కారు వద్దకు వెళ్లి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. దాంతో ఆమె సంతోషంతో కొంత నగదును హారతి పళ్లెంలో వేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు నగదు పంచారని ఎఫ్ఎస్టీ టీమ్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడంలో భాగంగా మహిళలకు నగదు ఇచ్చారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధన 171-E,171-H ఐపీసీ r/w188 ioc సెక్షన్ల కింద మంత్రి సత్యవతిపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజీ ఆధారంగా పోలీసుల సహాయంతో ఎన్నికల అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.