ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. కడప డ్రామాను డైవర్ట్ చేసేందుకే ఈ కుట్రలన్నీ అని అన్నారు. నాలుగు దశాబ్ధాలుగా కొనసాగుతోన్న చిట్ ఫండ్ కంపెనీ అని, మార్గదర్శి చిట్ లో ఉన్న ఎవ్వరూ కూడా తమకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయలేదన్నారు. అయినప్పటికీ ఈ అరెస్ట్ లు కక్షపూరిత రాజకీయాలు కోసమే అన్నారు. రాజమండ్రి టౌన్ లో ఆదిరెడ్డి భవానీ 25 వేల మెజార్టీతో గెలిస్తే కక్ష కడతావా.. కక్షపూరిత వైఖరితో పైశాచిక ఆనందంతో భయపెట్టాలని చూస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. తామెవరం ఈ అక్రమ కేసులకు భయపడటం లేదన్నారు.
నీలాగా సూట్ కేస్ కంపెనీలు పెట్టలేదంటూ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు దేవినేని ఉమ. తాడేపల్లిలో ఎవరి పేరు బయటకు వస్తుందోనని జగన్ భయపడుతున్నారు. నిన్ననే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాడని, భయపడేది లేదన్నారు. జైలుకు వెళ్లేందుకైనా, చావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నీలాంటి రాక్షసులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పదిలక్షల కోట్ల అప్పులు తీసుకెళ్లి, రెండు లక్షల కోట్లు దోచుకుని, 41 వేల కోట్లు ఒక్క లిక్కర్ లోనే దోచుకున్నావని ఆరోపించారు. పేదవాళ్ల గుండెలు ఆగిపోతున్నాయని, ఊపిరితిత్తులు, కిడ్నీలు చెడి పోతున్నాయన్నారు.
సీఎం జగన్ తమ్ముడి అరెస్ట్ ఖాయం..
బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని దేవినేని ఉమ అన్నారు. మే 10న, లేక 13వ తేదీన అరెస్ట్ అవుతాడో చూద్దామన్నారు. జగన్ క్యాబినెట్లో మంత్రి పెద్దిరెడ్డి కర్నాటకలో కూర్చుని సీఎం దోచుకున్న సొమ్మంతా అక్కడ పెడుతున్నారని ఆరోపించారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని, తప్పుడు కేసులు అన్నీటిపై న్యాయస్ధానంలో పోరాటం చేస్తున్నారని, న్యాయం గెలుస్తుందన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసు త్వరలోనే బయటకు వస్తారన్నరు. బీసీ వర్గాలమీద, బలహీన వర్గాల నాయకులను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహానాడులో లక్షలాది మంది రాజమండ్రిలో కదం తొక్కబోతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే నీ వక్ర బుద్ది బయటపెట్టావంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. రాజమండ్రిలో మహానాడు జయప్రదం అవుతుందన్నారు.
అవినీతిపరుడు, జైలు పక్షి..
ముఖ్యమంత్రి జగన్ క్రిమినల్ మైండ్ తో సీఐడీతో కేవలం టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం, వేధించడం వంటివి చేస్తున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేసి పోవాలన్నారు. 45 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎంతో మందితో పోరాడామని, మేమేదో భయపడిపోతామని అనుకుంటున్నాడని, పిరికిపంద, చేతకాని నేత జగన్ అంటూ పరుష పదజాలాన్ని వాడారు. బీసీలను వేధిస్తూ ఎందుకు టార్గెట్ చేస్తున్నావని సీఎంను ప్రశ్నించారు. జగన్ అవినీతి పరుడని, జైలు పక్షి అని విమర్శించారు. మర్డర్లు, హత్యలు చేసి రాజకీయాలు చేయలేదన్నారు. కానీ కంప్లైంట్ లేకున్నా తమను, కొన్ని సంస్థలను ఏపీ ప్రభుత్వం వేధిస్తుందన్నారు. అటు మార్గదర్శిని, ఇటు ఆదిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు చెందిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీని తామెప్పుడూ వేధించలేదన్నారు.
మహానాడు గురించి ఓర్వలేకనే..
రాజమండ్రిలో మహానాడు విజయవంతం అయితే జగన్ చరిత్ర ముగుస్తుందని భావించి కుట్రలు పన్నారని ఆరోపించారు. 1993లో ఎన్టీఆర్ ఇక్కడే మహానాడు పెట్టి కాంగ్రెస్ ను మట్టికరిపించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే చిట్ ఫండ్ కంపెనీని మూయించివేస్తానని బెదిరించారన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ ఓ పిట్టల దొర అని, అతనికి ఏమీ తెలియదన్నారు. బీసీ కులాన్ని కించపరుస్తున్నావని మండిపడ్డారు. టీడీపీ బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. సీఐడీ వేధింపులు ఆపకుంటే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు.