రాజమండ్రిలో టీడీపీకి చెందిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ఆదిరెడ్డి అప్పారావును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. తండ్రీ, కుమారులైన వీరిని రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరు కుంభకోణాలకు పాల్పడడం వల్లే అరెస్టు చేశారని మార్గాని భరత్ ఆరోపించారు. వారు జగజ్జనని చిట్స్‌ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ చిట్ ఫండ్ కంపెనీలో ప్రజల నుంచి సేకరించిన డబ్బులను వారి మరో కంపెనీలకు మళ్లించి ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారని అన్నారు. ఎంపీ భరత్‌ మంగళవారం (ఏప్రిల్ 2) రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. 


ఆదిరెడ్డి శ్రీనివాస్, అప్పారావు విషయంలో కక్ష సాధింపుకు ప్రభుత్వం పాల్పడిందని కొందరు అంటున్నారని, ఆదిరెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మార్గాని భరత్ అన్నారు. ఆదిరెడ్డిపై ఫోర్జరీ సంతకాలు చేసిన కేసు కూడా ఉందని అన్నారు. చిట్‌ ఫండ్స్‌ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయని, 20 వేలకు మించిన లావాదేవీలపై క్యాష్ రిసీట్స్ తీసుకోవడానికి అవకాశం లేదని అన్నారు. కానీ, కోట్ల రూపాయల లావాదేవీలు జగజ్జననిలో జరిగినట్టు అధికారులు గుర్తించారని అన్నారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదని అన్నారు. అక్రమాలు చేసే సంస్థలను ప్రభుత్వం ఎట్టి పరిస్థిత్తుల్లో ఉపేక్షించబోదని చెప్పారు. జగజ్జనని కూడా మార్గదర్శి సంస్థలాంటిదేనని, జగజ్జనని చిట్ ఫండ్ బాధితులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు.


‘‘చిట్ ఫండ్ 1982 ప్రకారం నిబంధనలు అంటూ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా బోర్డు తెప్పేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. శారద చిట్స్, సహారా చిట్స్ మోసాలు పార్లమెంట్ ను కుదిపేశాయి. సత్యం స్కాం, అగ్రీ గోల్డ్ కూడా ప్రజల సొమ్మును మళ్లించారు. వ్యాపారస్తులకు మేము వ్యతిరేకం కాదు. ప్రోపర్ రికార్డ్ మైంటైన్ చేయకుండా మోసాలు జరుగుతున్నాయి. మహానాడు దగ్గర పడుతుందని అరెస్ట్ చేశామని వైఎస్ఆర్ సీపీ నేతలపై మండిపడడం కరెక్ట్ కాదు. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసేస్తామని దమ్ముంటే మహానాడులో తీర్మానం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. ప్రోపర్ రికార్డ్ మైంటైన్ చేయకుండా మోసాలు జరుగుతున్నాయి. మహానాడు దగ్గర పడుతుందని అరెస్ట్ చేశామని వైఎస్ఆర్ సీపీ నేతలపై మండిపడడం కరెక్ట్ కాదు’’ అని మార్గాని భరత్ అన్నారు.


రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాసుతో పాటు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తండ్రీ, కుమారుడు ఇద్దర్నీ రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి పోలీసులు తరలించారు. అయితే ఈ ఇద్దర్ని ఏ విషయంలో అరెస్ట్ చేశారనే విషయం తొలుత ఎవరికీ తెలియలేదు. చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ చేశారా? లేదా మరో కేసులో అరెస్టు చేశారా? అనే దానిపై స్పష్టత రాలేదు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ అరెస్టులు చేశారని టీడీపీ నేతలు సీఐడీ కార్యాలయం ఎదుట కూడా ఆందోళన చేపట్టారు. వారి అరెస్టు తర్వాత మాజీ సీఎం చంద్రబాబు ఆదిరెడ్డి భవానీకి ఫోన్ చేసి పరామర్శించారు.