Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి నిడదవోలు మండలం తాడిమల్ల వెళ్తున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద ప్రమాదానికి గురైంది.
జీడిగింజలతో వెళ్తున్న వాహనం బోల్తాపడడంతో అందులో ఉన్న వారంతా ప్రమాదంలో చిక్కుకున్నారు. బయటకు రాలేక ఊపిరి ఆడక మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో పది మంది ప్రయాణికులు ఉన్నారు. వెనక ఉండి ప్రయాణిస్తున్న వారు మృతి చెందారు.
వెనుక ఉన్నవారంతా బస్తాల మధ్య ఇరుక్కొని ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. క్యాబిన్‌లో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కొవ్వూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ మధ్యవయసులో ఉన్న వాళ్లే. ఆయా కుటుంబాలకు వీళ్లే ప్రధాన జీవనాధారం.
ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:-
తాడి కృష్ణ(45), ముసలయ్య(35), బొక్కా ప్రసాద్(32), తమ్మి రెడ్డి సత్యనారాయణ (45), కత్తివ సత్తిపండు (40), డీ వెంకటరావు(40), పెనుగుర్తి చిన్న కత్తివ కృష్ణ(40),
ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందివ్వాలి అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటనగా అభివర్ణించారు. ప్రమాదంలో కష్ట జీవులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని ధైర్యం ఇచ్చారు.