Religious harmony in Kakinada During Ramzan 2022: కరోనా వ్యాప్తి కారణంగా రెండు సంవత్సరాల నుంచి ఇంటి వద్దనే రంజాన్ వేడుకలు జరుపుకున్న ముస్లింలు ఈ ఏడాది మసీదులు, దర్గాలు, ఈద్గాలకు భారీగా తరలి వస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కాకినాడలో మతసామరస్యం వెల్లివిరిసింది. కాకినాడ ఈద్గామైదానం వద్ద భోగిగణపతిపీఠం మజ్జిగ పంపిణీ నిర్వహించింది. ప్రార్థనలు చేయడానికి వచ్చిన ముస్లిం సోదరులకు మజ్జిక పంపిణీ చేసి పీఠం సభ్యులు మతసామరస్యం చాటడం పట్ల ముస్లిం మతగురువులు హర్షంవ్యక్తం చేశారు. ఈద్గా మైదానానికి పలువురు హిందూ ముస్లింలు ఒకే వాహనాల్లో తరలివెళ్లారు.
ముస్లింలతో కలిసి శ్రీభోగి గణపతిపీఠం
కాకినాడ ఈద్గా మైదానం వద్ద రంజాన్ ప్రార్థనలకు వచ్చిన వెయ్యి మంది ముస్లిం పౌరులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంభు శ్రీభోగి గణపతిపీఠం నిర్వహించింది. తద్వారా మత సామరస్యతకు ప్రతీకగా నిలిచారు. రంజాన్ సందర్భంగా ఈద్గా లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు రజాక్ తో పాటు నగరానికి చెందిన పలు ప్రార్థనా గురువులు ప్రముఖులను కలిసిన సందర్భంగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మతసామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధ సోదరులందరూ భారతీయ ప్రగతికి ప్రతీకగా ప్రతి పండుగల్లో కలిసి మెలిసి భాయీ భాయీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుందామని, శాంతియుతంగా ఉందామని రజాక్ పిలుపునిచ్చారు. కరోనా కష్ట కాలంలో కులం మతం అనే భేదం లేకుండా సేవలు చేసుకున్నామని గుర్తు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించే వేడుకల్లోనూ ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని మతసామరస్యాన్ని చాటుకుంటూ వేడుకలు విజయవంతమయ్యేలా చేస్తున్నారు.
తెలంగాణలోనూ ఘనంగా రంజాన్ వేడుకలు..
రంజాన్ మాసం (Ramzan 2022) ఉపవాస దీక్షలు సోమవారం రాత్రితో ముగిశాయి. నిన్న రాత్రి 8 గంటలకు ఆకాశంలో నెలవంక కనిపించింది. నెలవంక కనిపించడంతో నేడు పవిత్ర రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) వేడుకలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్కా మసీదు, పాత బస్తీలోని చౌక్ మసీదు, అఫ్జల్‌గంజ్ జామా మసీదు, వజర్ ఆలీ మసీదు, సిద్ది అంబర్ బజార్, మీరాలం ఈద్గా, మసీదులకు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మక్కా మసీదు, చార్మినార్, మీరాలం ఈద్గాతో పాటు తెలంగాణలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
Also Read: Ramadan 2022 Photos: హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు