రంజాన్ పర్వదినం సందర్భంగా పండుగ జరుపుకుంటున్న ముస్లింలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ట్విటర్ ద్వారా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు’’ అని జగన్ ట్వీట్ చేశారు.
‘‘పవిత్ర రంజాన్ మాసం మానవాళిని తోటి మానవులకు సేవ చేయాలని ఉద్బోధిస్తుంది’. తెలంగాణ ‘గంగా జమునా తెహజీబ్’ సంస్కృతిని ప్రతిబింబిస్తూ దేశంలో మతపరమైన సహనాన్ని పెంపొందించడంలో లౌకికవాదాన్ని బలోపేతం చేయడంలో రోల్ మోడల్‌గా నిలిచింది.’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
‘‘మానవ సమాజానికి సన్మార్గాన్ని, సత్యమార్గాన్ని ప్రబోధించే ఖురాన్‌లోని తొలి సూత్రాలను మహమ్మద్ ప్రవక్త వెల్లడించిన పవిత్ర మాసం రంజాన్. రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు. అని చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల తరహాలో తలపై క్యాప్ ధరించి శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ రంజాన్ పండుగ మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అంతా సుఖ సంతోషాలతో జీవించాలని, మంచి భవిష్యత్తు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
‘‘మతగురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష పూర్తిచేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం. ఒక వైపు ఆధ్యాత్మికత మరోవైపు సర్వమానవ సమానత్వం, సేవాభావం చాటిచెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్ ప్రసాదించాలని కోరుకుంటూ.. మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.