దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక మంచి సంక్షేమ పథకం తీసుకొచ్చింది లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలను ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వాటికి తూట్లు పడటం తప్ప కొత్తవి చేయలేదన్నారు. ఈరోజు చంద్రబాబును చూసి టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులే "ఇదేం కర్మ" రా బాబు మాకు అని అనుకుంటున్నారంటూ మాజీ సీఎంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. రాజమండ్రిలో సాంస్కృతిక సంబరాల్లో పాల్గొన్న మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా చంద్రబాబుకు 23 ఎమ్మెల్యేలు, మూడు ఎంపీ స్థానాలు ఇచ్చామనీ, ఈసారి అసలు ఏమీ లేకుండా చేస్తే మనకి ఈ కర్మ ఉండదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. 


చంద్రబాబు.. మొన్న బాదుడే బాదుడు, ఇప్పుడు ఇదేమి కర్మ అంటూ మమ్మల్ని చంపుతున్నాడనీ ఏపీ ప్రజలు బాధపడుతున్నారని మంత్రి రోజా చెప్పారు. టీడీపీని గమనిస్తే బూత్ కమిటీలు వేసుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లల్లో బరిలో నిలిపేందుకు అభ్యర్థులు కూడా టీడీపీలో లేరని గుర్తించాలన్నారు. వైఎస్సార్ సీపీ గురించి చెప్పినా ప్రజలెవరూ నమ్మలేని పరిస్థితి ఉందని, ఇదేం ఖర్మరా అని బాబు  ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నట్లు ఉందని సెటైర్లు వేశారు వైసీపీ నాయకురాలు రోజా.


చంద్రబాబు ప్రారంభించిన బాదుడే బాదుడు ఇదేం కర్మ, కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొనడం లేదని, ప్రజాదరణ లేక ఆ ఆ కార్యక్రమాలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి సీఎం అయ్యాక 98% తన ఇచ్చిన ప్రతి వాగ్దానాలను నెరవేర్చారని, ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాకిలికి వెళ్లినా ప్రజలు జగనన్న వైపు ఉన్నారని తెలిపారు. మళ్ళీ అమరావతి టు అరసవెల్లి అని చెప్పి రైతుల ముసుగులో పెయిట్ ఆర్టిస్టులతో తన బినామీల కోసం చంద్రబాబు రైతు పాదయాత్ర చేయించారని ఆరోపించారు. రైతులందరూ వాళ్ళ ఐడి కార్డులతో పాల్గొనాలని హైకోర్టు చెప్పగానే ఆ పాదయాత్ర గాల్లో కలిసిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేవలం బినామీ పేర్లతో లాండ్లు కొనుక్కున్న వాళ్లకే బాధ తప్ప నిజమైన రైతులకు బాధ లేదు అని, అందుకే ఆ ప్రోగ్రాం పక్కకి వెళ్ళిందన్నారు. 


 ‘ఇప్పటికైనా చంద్రబాబు దత్తపుత్రుడిని, ఉత్త పుత్రుడిని తరిమికొట్టాలి. 2024లో 175 కి 175 సీట్లు జగన్ పార్టీని గెలిపిస్తే బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తుంది. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. లేదంటే వీళ్ళొచ్చి ఇదేం కర్మ రా బాబు అప్పుడప్పుడు టార్చర్ పెడుతున్నాడని ప్రజలు అనుకుంటారు. పిల్లలకు చక్కటి చదువుకి సపోర్టివ్ గా ఉన్నందుకు విద్యార్థులు తరపున జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం మదనపల్లిలో విద్యా దీవెన కింద దాదాపుగా 695 కోట్ల రూపాయలను 11 లక్షల మంది విద్యార్థులకు వాళ్ళ తల్లి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని’ ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా చెప్పారు.