Pawan Kalyan East Godavari Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జనసేనాని పర్యటన కొనసాగనుంది. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరామర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేడు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కోలమూరు, కొంతమూరు, క్వారీ సెంటర్, లాలాచెరువు, బొమ్మూరు సెంటర్, రాజవోలు మీదుగా కడియం ఆవలో పర్యటిస్తారని జనసేన జిల్లా అధ్యక్షుడు దుర్గేష్ చెప్పారు.






‘‘రాత్రికి రాత్రి పవన్ కల్యాణ్ గారు వస్తున్నారని ఒక రెండు లారీలు పంపి తడిచిన ధాన్యాన్ని కొంటున్నమని ప్రభుత్వం చెబుతోంది. ఇది సరైన పద్దతి కాదు, ప్రతి గింజా కొంటాం అన్నారు, ఎందుకు కొనట్లేదు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం?’’ అని కడియం గ్రామ రైతు ఆవేదన చెందిన వీడియోను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.






అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అక్కడి పార్టీ నేతలు స్వాగతం పలికారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజమండ్రి నగరం - బొమ్మూరు - రాజవోలు మీదుగా  రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని ఆవడి భూములలో దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకొని నష్టపోయిన రైతులతో మాట్లాడతారు. తర్వాత పి.గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడతారు.


అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత


అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం మండలం పప్పుల వారి పాలెంలో స్వల్ప ఉద్రిక్తత జరిగింది. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో పప్పులవారిపాలెం సెంటర్‌లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పూలదండ వేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పూలదండ వేసేందుకు అనుమతి కావాలంటూ అడ్డుకున్న పోలీసులతో జనసేన నేతలు గొడవకు దిగారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్‌లో దిగగానే ఆయన పర్యటించే మండలాల్లో పవర్ కట్ చేశారంటూ జనసైనికులు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.