Top Headlines Today:


నేడు తెలంగాణ టెన్త్ రిజల్ట్స్


ఈ మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగానే విడుదల చేయబోతున్నారు. గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను విడుదల చేస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్విక్‌ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


నేడు ఏపీ పాలిసెట్‌ 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం (మే 10) ఉదయం 11 గంటలకు ఏపీ పాలిసెట్‌ (AP POLYCET)– 2023 పరీక్ష ప్రారంభంకానుంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్నాట్లు పూర్తి చేశారు. పాలిసెట్‌-2023 పరీక్షకు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది పాలిసెట్‌కు హాజరవుతారని సాంకేతిక విద్యాశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 54 పాలిటెక్నిక్ కేంద్రాల్లో 10 వేల మంది పరీక్ష రాయనున్నారు. మిగతా వారికి ఇతర విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల నుంచే అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభించిన తర్వాత ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు 10 రోజుల్లో విడుదల చేయనున్నారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి.


నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌


తెలంగాణ ఎంసెట్ బుధవారం (మే 10) నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు అగ్రికల్చర్ విభాగం రెండు విడతల పరీక్షలకు తెలంగాణ, ఏపీల నుంచి మొత్తం 57,577 మంది హాజరుకానున్నారు. ఉదయం విడతలో తెలంగాణ నుంచి 23,486 మంది, ఏపీ నుంచి 5,199 మంది రాయనున్నారు. మధ్యాహ్నం విడతలో తెలంగాణ నుంచి 23,691 మంది, ఏపీ నుంచి 5,201 మందికి స్లాట్లు కేటాయించామని ఎంసెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్‌కు తెలంగాణలో 95, ఏపీలో 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ ప్రవేశ‌ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెషన్లలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంసెట్ క‌న్వీన‌ర్ డాక్టర్ బి. డీన్ కుమార్ విద్యార్థులకు కీల‌క ఆదేశాలు జారీచేశారు. 


పవన్ టూర్


అకాల వర్ష బాధిత రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శిస్తారు. తర్వాత   కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఓజీ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అకాల వర్షాల కారణంగా తూ.గో, ప.గో రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో..  రైతులకు మద్దతుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.   చివరి క్షణంలో ఖరారైన పర్యటన అయినప్పటికీ జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం మండంలలో జనసేన పార్టీ విజయం సాధించింది.


ఉత్తమ పోలీసులకు అవార్డులు 
తెలంగాణలో ఉత్తమ పనితీరు చూపించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను ఇవాళ ప్రదాన చేయనుంది. రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ హాజరుకానున్నారు. 2022 సంవత్సరానికి 30 మంది పోలీసులకు అతి ఉత్కృష్ణ సేవా పతకం, 28 మందికి ఉత్కృష్ణ సేవా పతకం, ఏడుగురికి అసాధారణ అసూచన కుశలత పతకం, 8 మందికి  హోంమినిసటర్ మెడల్స్ ఇలా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: L&T, డా.రెడ్డీస్ ల్యాబ్స్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బాష్, గుజరాత్ గ్యాస్, ఎస్కార్ట్స్ కుబోటా. ఈ కంపెనీల షేర్లపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


లార్సెన్ & టూబ్రో (L&T): ఈ కంపెనీ తన మార్చి త్రైమాసిక ఆదాయాలను నేడు విడుదల చేస్తుంది. ఆరోగ్యకరంగా ప్రాజెక్టుల అమలు, బలమైన ఆర్డర్ బుక్ నేపథ్యంలో టాప్‌లైన్ & బాటమ్‌లైన్ రెండింటిలోనూ రెండంకెల వృద్ధిని ప్రకటిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. FY24లో సేల్స్‌, ఆర్డర్ ఇన్‌ఫ్లో వృద్ధిపై మేనేజ్‌మెంట్‌ ఏం చెబుతుందన్న దానిపై దలాల్ స్ట్రీట్ నిశితంగా ట్రాక్ చేస్తుంది. 


డా.రెడ్డీస్ ల్యాబ్స్: 2023 మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో మంచి పెరుగుదలను నివేదించవచ్చు. US అమ్మకాల్లో బలమైన పట్టు కొనసాగించిన కారణంగా ఆదాయ వృద్ధి రెండంకెల్లో పెరుగవచ్చు. FY23 ప్రధానంగా రెవ్లిమిడ్ విక్రయాల ద్వారానే నడిచింది కాబట్టి, FY24లో US విక్రయాల పరిస్థితిపై మేనేజ్‌మెంట్‌ ఏ చెబుతుందో పెట్టుబడిదార్లు గమనిస్తారు. రాబోయే 12-15 నెలల్లో రాబోయే ప్రొడక్ట్‌ లాంచ్‌ల కోసం కూడా చూస్తారు.


గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్: ఈ FMCG మేజర్, 2023 మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో రెండంకెల వృద్ధిని నివేదించవచ్చు, టాప్‌లైన్‌లోనూ ఇదే విధమైన వృద్ధి కనిపించవచ్చు. అనేక త్రైమాసికాల దిద్దుబాటు తర్వాత, ఇండోనేషియా వ్యాపారం తిరిగి పుంజుకుంటుంది. నైజీరియాలోని స్థానిక సమస్యల వల్ల ఆఫ్రికా వ్యాపార వృద్ధి ప్రభావితమవుతుంది. పామాయిల్ ధరలలో తీవ్ర తగ్గుదల వల్ల స్థూల మార్జిన్లలో సీక్వెన్షియల్ (QoQ), YoY మెరుగుదలకు దారి తీస్తుందని అంచనా.


అపోలో టైర్స్: మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 427.4 కోట్లకు చేరుకుంది, YoYలో దాదాపు 4 రెట్లు పెరిగింది. కార్యకలాపాల ఆదాయం సంవత్సరానికి 12% పెరిగి రూ. 6,247 కోట్లకు చేరుకుంది. ఒక్కో షేరుకు రూ. 4 తుది డివిడెండ్, రూ.0.50 ప్రత్యేక డివిడెండ్‌ను బోర్డు సిఫార్సు చేసింది. ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చే 5 సంవత్సరాల కాలానికి నీరజ్ కన్వర్‌ని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించడానికి కూడా బోర్డు ఆమోదించింది. మొత్తం FY23కి, సంస్థ నికర లాభంలో 73% వృద్ధితో రూ.1,105 కోట్లు నమోదు చేసింది. ఆదాయంలో 17.3% వృద్ధితో రూ. 24,568 కోట్లకు చేరుకుంది.


నజారా టెక్నాలజీస్: మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 2.6 కోట్లకు చేరింది, ఏడాది ప్రాతిపదికన (YoY) 18% వృద్ధిని నమోదు చేసింది. కార్యకలాపాల ఆదాయం 65.2% పెరిగి రూ. 289 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్‌గా, మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 84% పడిపోయింది, ఆదాయం 8% పడిపోయింది. మొత్తం FY23లో, ఏకీకృత నికర లాభం దాదాపు 39% పెరిగి రూ. 39.4 కోట్లకు చేరుకుంది, ఆదాయం 76% వృద్ధి చెంది రూ. 1,091 కోట్లకు చేరుకుంది.


బాష్, గుజరాత్ గ్యాస్, ఎస్కార్ట్స్ కుబోటా: మార్చి త్రైమాసికం, మొత్తం ఆర్థిక సంవత్సరం ఆదాయాలను పరిశీలించి, ఆమోదించడానికి & డివిడెండ్ చెల్లింపును సిఫార్సు చేయడానికి ఈ కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఈరోజు సమావేశం కానున్నాయి.


స్పైస్‌జెట్: విమానయాన సంస్థకు చెందిన మూడు విమానాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం కోసం లీజర్లు ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAని సంప్రదించారు. ఈ బడ్జెట్ క్యారియర్‌కు చెందిన చాలా విమానాలు వివిధ కారణాల వల్ల గ్రౌండ్‌కే పరిమితం అయ్యాయి.


జైప్రకాష్ అసోసియేట్స్: ఈ కంపెనీ అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 3,956 కోట్ల విలువైన రుణాలను ఎగవేసింది.


దాల్మియా సిమెంట్ భారత్: అసోంలో దాదాపు రూ. 4,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది, ఇది 2,500 ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుంది.


ఇవాళ్టి ఐపీఎల్‌లో
ఐపీఎల్ 2023 55వ లీగ్ మ్యాచ్ ఈ రోజు (మే 10) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, రాత్రి 7 గంటలకు టాస్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా చెన్నై ప్లేఆఫ్స్ కు చేరువ కావాలని భావిస్తుండగా, ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ ఆశలను నిలబెట్టుకోవాలని చూస్తుంది. గత మ్యాచ్ విషయానికొస్తే ఇరు జట్లు విజయం సాధించాయి. ముంబై ఇండియన్స్పై చెన్నై విజయం సాధించగా, బెంగళూరుపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.