Pawan kalyan to pithapuram for the first time as Deputy CM :   అందరి చూపు పిఠాపురంపైనే కేంద్రీకృతమై కనిపిస్తోంది.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుని నూరు శాతం సక్సెస్‌ రేటుతో విజయపథంలో నడిచింది.  తమ అభిమాన నాయకుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం   ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు జనసేనాని జూలై ఒకటో తేదీన పిఠాపురంలో ప్రయటించనున్నారు.  


డిప్యూటీ సీఎం హోదాలో తొలి సారి పిఠాపురానికి పవన్ రాక   


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా త పిఠాపురం నియోజవర్గానికి తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారు.. జూన్‌ 12న రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా గడిపిన పవన్‌ కల్యాణ్‌ తన సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై ఒకటిన రాబోతున్నారు.. దీంతో పిఠాపురం ప్రజలకే కాదు.. ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పవన్‌ కల్యాణ్‌ వీరాభిమానులు పిఠాపురం వచ్చేందుకు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 


ఉప్పాడలో వారాహి సభ


 పవన్‌ కల్యాణ్‌ జూలై ఒకటిన తన నివాసానికి చేరుకుని అక్కడి నుంచి ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే వర్మతోపాటు తన గెలుపు కోసం కృషి చేసిన కూటమి ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం ఉప్పాడ బస్టాండ్‌ ప్రాంగణంలో వారాహి బహిరంగ సభలో   ప్రసంగిస్తారని తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరగనున్న పర్యటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 


ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు 
 
పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  అడుగడుగునా పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షలతోపాటు స్వాగతం చెబుతూ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలనుంచి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూడా పిఠాపురం వరుస కట్టే అవకాశాలున్నాయి.  క పవన్‌  కల్యాణ్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకునేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్‌, ఎస్పీతోపాటు అన్నిశాఖల ముఖ్య అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులు రానున్నారు. 


భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు            


పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు భారీస్థాయిలో పిఠాపురం తరలి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఆ ఏర్పాట్లులో నిమగ్నమవుతున్నారు.  ఉప్పాడలో జరిగే వారాహి బహిరంగ సభకు ప్రజలు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కుప్పం పర్యటనలో పాల్గన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తనను ఎనిమిది సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి వరాల జల్లులు కురిపించారు. ఇదే తరహాలో తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంకు పవన్‌ కల్యాణ్‌ వరాలు కురిపిస్తారని అంచనాలున్నాయి. ఇప్పటికే పాదగయ క్షేత్రాన్ని గర్వించదగ్గ స్థాయిలో ఆధ్మాతిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఏదిశగా అడుగులు వేస్తారో, పిఠాపురంను అభివృద్ధి పథంలో ఎలా నడిపిస్తారో వేచిచూడాల్సి ఉంది..