Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ముగిసింది. జైల్లో బాబును నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు బాబుతో ములాఖత్ అయ్యారు. ములాఖత్ కోసం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు లోకేష్ చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రికి చేరుకున్నారు. బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవ్వడం, జైలు అధికారులు లీగల్ ములాఖత్‌లు కుదించిన నేపథ్యంలో బాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ కీలకంగా మారింది.


చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ నేపథ్యంలో జైలు వద్దకు టీడీపీ నేతలు భారీగా చేరుకున్నారు. ఎంపీ రామ్మోహన్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, కొల్లు రవీంద్ర, చినరాజప్ప జైలు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు వస్తే అరెస్ట్ చేస్తున్నారని, ఇది దారుణమని ఆరోపించారు. చంద్రబాబుకు జైల్లో ఏమైనా జరిగితే వైసీపీ మూల్యం చెల్లించుకోవాలని, చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులకు వివరాలు ఇవ్వట్లేదని అన్నారు. చంద్రబాబు ఆరోగ్య వివరాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.


జైలు వద్ద మీడియాతో టీడీపీ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయవాదులు ములాఖత్ కాకుండా చేస్తున్నారని, భయపడుతూ జగన్ పరిపాలన చేయాల్సిన అవసరం ఉందా? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వైద్యలు ఇచ్చిన మందుల వల్ల ఉపశమనం లేదని సమాచారం అందుతుందని అన్నారు. చంద్రబాబుకు నిర్వహించిన పరీక్షలపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని భువనేశ్వరి లేఖ రాశారని, అయినా సమాధానం లేదని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు రక్త నమూనాలను చంద్రబాబు వ్యక్తిగత వైద్యులకు పంపితే సూచనలు చేస్తారని, పాత మందులకు మార్పులు, చేర్పులపై సూచనలు చేస్తారని అన్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని, రాష్ట్రంలో రాక్షస క్రీడ ఆడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ సర్కార్ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని, ఏ ఒక్క కేసులోనూ ఆధారం చూపలేకపోయారని విమర్శించారు.


'జైలు మాన్యువల్ నిబంధనలను అధికారులు అమలు చేయాలి. చంద్రబాబు మీద వైసీపీ నేతలు బాష మార్చుకోవాలి. హెల్త్ రిపోర్ట్ కాపీలను ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు ఇవ్వాలి. దీనిపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి' అని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అటు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను టీడీపీ నేతలు కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో 8 మంది టీడీపీ నేతలు గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిణామాలు, చంద్రబాబు అరెస్ట్‌పై గవర్నర్‌కు నేతలు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, సీఐడీ, పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్‌పై వాస్తవాల పేరుతో గవర్నర్‌కు పుస్తకాలు అందించారు.  ఏపీలోని పరిణామాలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. కాగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు అందించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వాయిదా పడింది. ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.