ఓ ప్రేమ జంట ఇద్దరి ఇళ్లలోనూ చెప్పాపెట్టకుండా ఎక్కడికో పారిపోవడం ప్రియుడి తండ్రి చావుకొచ్చి పడింది. తమ కుమార్తెను ఎక్కడికో తీసుకుపోయాడంటూ అమ్మాయి తరపు వారు ఆరోపించారు. అంతేకాక, అబ్బాయి ఇంటిపైకి మూకుమ్మడిగా వచ్చి అతని తండ్రిపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు అనే గ్రామంలో చోటు చేసుకుంది. 


స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక ప్రేమ జంట ఈ నెల 27న వారి వారి ఇళ్లలో తల్లిదండ్రులకు, పెద్దలకు చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో గండేపల్లి మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత నెలకొంది. అబ్బాయి తండ్రిపై అమ్మాయి కుటుంబ సభ్యులు ఆదివారం దాడి చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉప్పలపాడుకు చెందిన పిల్లి కృష్ణ కుమార్‌ అనే యువకుడు సీతానగరం మండలం ఇనుగంటి వారి పేటకు చెందిన యువతి కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అమ్మాయి అప్పుడప్పుడు తన అమ్మమ్మ గారి ఊరు అయిన ఉప్పలపాడు గ్రామానికి వచ్చి వెళుతూ ఉండేది. ఇలా వచ్చి వెళ్తున్న క్రమంలోనే అదే ఊరిలో ఉండే కృష్ణ కుమార్‌కు ఆమెకు పరిచయం ఏర్పడింది. అది మెల్లగా ప్రేమగా మారింది.


ఇలాగే సంక్రాంతికి అమ్మాయి అమ్మమ్మ గారి ఊరు అయిన ఉప్పలపాడు వచ్చింది. అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉన్న అదే సమయంలో ఈ నెల 27న పిల్లి కృష్ణ కుమార్‌‌తో పాటు యువతి కూడా కనిపించకుండా పోయింది. తమ అమ్మాయి వెళ్లిపోయేందుకు కారణం పిల్లి కృష్ణ కుమార్‌ అని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు.. ఆదివారం అబ్బాయి తండ్రి పిల్లి గోవింద్‌ ఇంటి వద్ద ఉన్న సమయంలో ఆయన వద్దకు వచ్చి ప్రశ్నించారు.


ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో అమ్మాయి తరఫు వారు అబ్బాయి తండ్రి గోవింద్‌‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ గోవింద్‌ను పోలీసులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. గోవింద్‌‌పై దాడిచేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కనిపించకుండా పోయిన పిల్లి కృష్ణ కుమార్‌‌తో పాటు యువతిని కూడా వెతికే పనిలో పోలీసులు ఉన్నారు.


Also Read: Vizag Drugs: హైదరాబాద్ నుంచి విశాఖకు ప్రియురాలు డ్రగ్స్ సరఫరా.. ప్రియుడికి ఇస్తుండగా అడ్డంగా బుక్


Also Read: Jagityal Murder: సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య.. రెండో భర్త కొడుకు, మొదటి భర్త కుమారుడి సహకారంతోనే..