డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత ఏడాదితో పోల్చితే కోడి పందేలు లాంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సీరియస్ యాక్షన్, నిబంధనలతో ఈ ఏడాది బెట్టింగ్స్ కూడా చాలా మేర తగ్గాయి. ఈ క్రమంలో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కోనసీమ జిల్లాలో అరెస్టు కావడం కలకలం రేపింది. చీకోటి ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలో అతడిని వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో అసలేం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


కోనసీమ అనగానే కోడి పందెలు, గుండాట, బెట్టింగ్స్ కు ఫేమస్. దాంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేవలం కోడి పందెలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చి, గుండాట లాంటివి నిర్వహించకూడదని షరతులు పెట్టారు. ఈ క్రమంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా మామిడికుదురు మండలం నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో చీకోటి ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు నగరం ఎస్సై జానీ భాషా. గతంలో చికోటి ప్రవీణ్ పై గుడివాడలో క్యాసినో నిర్వహించాడని ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. 


కోడి పందేలలో పాల్గొనేందుకు కోనసీమకు చీకోటి ప్రవీణ్ 
చీకోటి ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి కోడి పందేలలో పాల్గొనేందుకు కోనసీమకు వచ్చాడని తెలుస్తోంది. చికోటి ప్రవీణ్ వద్ద హవాలా సొమ్ము పెద్ద మొత్తంలో ఉందన్న సమాచారంతో మామిడికుదురు మండల పరిధిలోని నగరం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో అతడు ప్రయాణిస్తున్న వాహనాన్ని తనిఖీలు చేశారు. అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరిశీలించినా ఎలాంటి సొమ్ము దొరకలేదు. దాంతో కొంతసేపు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వివరాలు సేకరించిన తరువాత పోలీసులు చీకోటి ప్రవీణ్ ను వదిలేశారు. క్యాసినో లాంటివి ఏమైనా నిర్వహించడానికి వెళ్తున్నాడా అనే కోణంలో పోలీసులు అనుమానించి చీకోటి ప్రవీణ్ ను ప్రశ్నించారు. తనిఖీలు పూర్తయ్యాక స్నేహితులతో పాటు అతడ్ని విడిచి పెట్టారని సమాచారం.


కోడి పందేలపై ఒకింత మినహాయింపు
సంక్రాతి సంప్రదాయానికి అడ్డుపడొద్దూ అంటూ కోనసీమ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రి ఇలా అంతా ఏకమై పై స్థాయి నుంచి మరీ సిఫారసులు చెప్పించుకున్నప్పటికీ చివరి నిమిషంలో కేవలం కోడి పందేలపై ఒకింత మినహాయింపు ఇచ్చారు పోలీసులు. కోడి పందేల ముసుగులో గుండాట, కోతాట, అశ్లీల నృత్యాలు, మద్యం విక్రయాలు ఇలా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మాత్రం ఉపేక్షించేది లేదని సూటిగా హెచ్చరించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఈ వ్యవహారంలో మొట్టమొదట బలయ్యేది మీరేనని ఎస్పీ తన శాఖలోని సిబ్బందికి అంతర్గతంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్సైలు, సీఐ లు కోడిపందేలు బరుల వద్దకు ఉరుకులు పరుగులు పెట్టి గుండాట శిబిరాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


కోడిపందేలకు వెసులు బాటు ఇచ్చినా.. జూదాలు అడనీయకుండా పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేయగలగడంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారు. దీంతో పోలీస్‌ బాస్‌కు అన్ని వర్గాలనుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.