Konaseema Cockfights Pongal 2023: సంక్రాంతి సందర్భంగా ప్రతీఏటా జరిగే మూడు రోజుల కోడి పందేలకు ఈసారి పుల్ ష్టాప్ పడినట్లే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి నిబద్ధత గురించి తెలిసిన వారు మాత్రం ఆయన ఒక్కసారి చెబితే అదే జరుగుతుందన్నారు.. సరిగ్గా కోనసీమ జిల్లాలో నేడు అదే జరుగుతోంది. ఆయన చెప్పినట్లే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేందుకు కారణంగా నిలుస్తోన్న గుండాట, కోతాట తదితర జూదాలు ఈసారి పందేల బరుల్లో ఉనికే లేకుండా పోయింది. ఎక్కడ జూదాలు జరిగితే మొట్టమొదట ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులపై వేటు తప్పదని హెచ్చరించడంతో ఎక్కడక్కడే పోలీసులు అప్రమత్తమయ్యారు. నేరుగా పందేల వద్దకే వెళ్లి ఎక్కడైనా గుండాట ఆడేందుకు బల్లలు ఏర్పాటు చేస్తుంటే వాటిని ధ్వంసం చేశారు.. గుండాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతీ ఏటా కళకళలాడే కోడిపందేల బరులు వెలవెలబోయాయి.
కోడి పందేలపై ఒకింత మినహాయింపు
సంక్రాతి సంప్రదాయానికి అడ్డుపడొద్దూ అంటూ కోనసీమ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రి ఇలా అంతా ఏకమై పై స్థాయి నుంచి మరీ సిఫారసులు చెప్పించుకున్నప్పటికీ చివరి నిమిషంలో కేవలం కోడి పందేలపై ఒకింత మినహాయింపు ఇచ్చారు పోలీసులు. కోడి పందేల ముసుగులో గుండాట, కోతాట, అశ్లీల నృత్యాలు, మద్యం విక్రయాలు ఇలా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మాత్రం ఉపేక్షించేది లేదని సూటిగా హెచ్చరించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఈ వ్యవహారంలో మొట్టమొదట బలయ్యేది మీరేనని ఎస్పీ తన శాఖలోని సిబ్బందికి అంతర్గతంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సైలు, సీఐ లు కోడిపందేలు బరుల వద్దకు ఉరుకులు పరుగులు పెట్టి గుండాట శిబిరాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఏమయ్యాయి..
అమలాపురం కాటన్ గెస్ట్ హౌస్ కేంద్రంగా కోనసీమ ప్రజాప్రతినిధులు కొన్ని గంటల పాటు పైరవీలు చేసినప్పటికీ పోలీసులు నిబద్ధత ముందు అవేమీ నిలువలేక పోయాయి. ముఖ్యంగా జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మార్పుచేయించలేకపోయారు. సాంప్రదాయం అంటూ చివరకు అనేక సిఫారుసల మేరకు మాత్రం కేవలం కోడిపందేలకు అవకాశం తెచ్చుకోగలిగారు. అదికూడా భోగి పండుగ రోజైన శనివారం 11 గంటల వరకు జిల్లాలో ఎక్కడా పందేలు ప్రారంభం కాలేదు. ఏక్షణాన పోలీసులు దాడులు చేస్తే కేసుల్లో ఇరుక్కుంటామనో తెగ భయపడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు.
ఎస్పీకి అభినందనల వెల్లువ..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందేలు విచ్చలవిడిగా ప్రతీ ఏటా జరుగుతూనే ఉన్నాయి. అయితే పేరుకే కోడిపందేలు అయినా ఎక్కవగా అక్కడ గుండాట వంటి జూదాలు అడ్డూ అదుపు లేకుండా జరిగేవి. వీటికి తోడు మద్యం దుకాణాలు, మరికొన్ని చోట్ల అశ్లీల నృత్యాలు ఇలా అనేక చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు జరిగేవి. అయితే కోడిపందేలు ఎట్టిపరిస్థితుల్లోనూ జరగవని, ఎవ్వరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. చివరకు ప్రజాప్రతినిధులు అనేక ప్రయత్నాల అనంతరం కోడిపందేలకు వెసులు బాటు ఇచ్చినా.. జూదాలు అడినీయకుండా పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేయగలగడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. దీంతో పోలీస్ బాస్‌కు అన్ని వర్గాలనుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌మీడియా వేదికగా పలుపార్టీలు ఎస్పీకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రజా సంఘాలు ఎస్పీ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. జూదాల వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వీటిని ఉక్కుపాదంతో అణిచివేయడంలో విజయం సాధించారంటూ ప్రశంసిస్తున్నారు.