కోనసీమ కోడిపందేలు జరుగుతాయా లేదా అన్నది ఉత్కంఠ ఇంకా తెరపడింది. కోనసీమ వ్యాప్తంగా బరుల్లోనూ కోడి కాలు దువ్వుతోంది. పండుగ మూడు రోజులు నిర్వహించుకునేందుకు లోపాయికారీ అనుమతి ఉందన్న రాజకీయ నేతల మాటలతో రాత్రికి రాత్రి బరులు వెలిశాయి.
ఎట్టిపరిస్థితుల్లోనూ కోడిపందేలను అనుమతి ఇవ్వమంటూ ఖాకీలు హూంకరించినప్పటికీ ఖద్దరు వాటిని లెక్కచేయలేదు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గబోనంటూ పొలిటికల్ లీడర్లకు సంకేతాలు ఇచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక చాలా మంది డైలమాలో పడ్డారు. అసలు పందేలు లేవని నిన్నటి సాయంత్రం వరకు అంతా అనుకున్నారు. రాత్రికి రాత్రే సీన్ మొత్తం మారిపోయింది. రాజకీయ నేతల గట్టిగా భరోసా ఇవ్వడంతో బరుల్లోకి కాలు పెట్టి పందేలకు తెర తీశారు.
కోనసీమ ప్రజాప్రతినిధులు అత్యవసర సమావేశం..
కోనసీమ వ్యాప్తంగా కోడిపందాలు జరగవని అంతా డిసైడ్ అయిన వేళ కోనసీమలోని ప్రజాప్రతినిధులు శుక్రవారం అమలాపురం కాటన్ అతిథి గృహంలో అత్యవసరంగా సమావేశమయ్యారని టాక్ నడుస్తోంది. పండుగ మూడు దినాలు పందేలు నిర్వహణ లేకుండా అడ్డుకట్టవేస్తే పార్టీ క్యాడర్ నుంచి కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారట. మంత్రి విశ్వరూప్ అధ్యక్షతన ఈ భేటీ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశానికి శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్‌కుమార్, కొండేటి చిట్టిబాబు, చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారట. మంత్రి చెల్లుబోయిన వేణు మాత్రం ఈ భేటీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
సమావేశం అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ గతంలో మాదిరిగానే పందేలు జరుగుతాయని రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ తెగేసి చెప్పారు. అదే బాటలోనే మిగిలిన శాసన సభ్యులు కూడా మంత్రి విశ్వరూప్‌కు చెప్పడంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఇన్‌చార్జ్ ఎంపీ మిధున్ రెడ్డితో మాట్లాడారు. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రావడంతో అనుయాయులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి భూమి పూజలు చేసి బరులు సిద్ధం చేసేశారు.
ఇదిలా ఉంటే పోలీసులు హెచ్చరికలు షరా మామూలుగానే ఉన్నప్పటికీ... ఎస్పీ పని తీరు తెలిసిన వారంతా పందాలు జరగవనే అనుకున్నారు. అయితే పైస్థాయిలో ఒత్తిళ్లు తీవ్రతరం అవడంతో కోడిపందేల పట్లా చూసీ చూడనట్లుగా వ్యవహరించినప్పటికీ గుండాటలపై గురిపెట్టే విధంగా సన్నద్ధమవుతున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బరుల వద్ద రికార్డింగ్ డ్యాన్స్‌లు కానీ, గుండాట, కోతటలు కానీ నిర్వహిస్తే ఊరుకోమని హెచ్చరించినట్లు సమాచారం.
ఉదయం నుంచి పడి గాపులు...
కోనసీమలో దాదాపు 200 వరకు బరులు ఏర్పాటుకు సిద్ధమైనప్పటికీ పోలీసుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఏం చేయాలో పాలు పోక ధైర్యం చేసి అడుగు ముందుకు వేయలేక ఇబ్బంది పడ్డారు. చివరకు పై స్థాయి నుంచి కోడిపందాలపై సానుకూలత వ్యక్తం కావడంతో ఆలస్యంగా కోడిపందాలు ప్రారంభమయ్యాయి. చాలా ప్రాంతాల్లో బరులు సిద్ధం చేసినప్పటికీ బరిలోకి కాలు పెట్టేందుకు ఒకింత భయపడే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే పందేలు ప్రారంభమైన నేపథ్యంలో మిగిలిన బరులను కూడా చకచక ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.
కాకినాడ జిల్లాలో ఉదయం నుంచి ప్రారంభమైన పందేలు...
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే కాకినాడ జిల్లాలో ఉదయం నుంచి పలుచోట్ల పందాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తాళ్లరేవు మండలంలో పలుచోట్ల పందెం కోళ్ళు కాళ్లు దువ్వుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కోడిపందాలతోపాటు గుండాట, కోతాట, తదితర జుదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం
గత 15 రోజులుగా కోడి పందాలు గుండాట్లను నియంత్రించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. సాంప్రదాయ ముసుగులో పందాలకు తెరిలేపారు. నరసాపురం తీర ప్రాంతంలో విచ్చలవిడిగా కోడిపందాలు గుండాట మొదలయ్యాయి. నర్సాపురం మొగల్తూరు మండలంలో సుమారు 25కు పైగా బరుల్లో పందాలు జరుగుతున్నాయి. వీటిలో ఆరుకుపైగా పెద్ద బరువులు ఉన్నాయి. అన్ని బరువులు వద్ద నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సిసలి గ్రామంలో పోలీసు హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నడూ లేని విధంగా సాంప్రదాయ పేరుతో కోడిపందాలు ముసుగులో కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కోడిపందాలను ప్రారంభించారు. నిన్నటి వరకు ఎంతటి వారైనా అంతు చూస్తామని ప్రగల్పాలు పలికిన పోలీసులు కనుచూపుమే కాన రావడం లేదు. పేకాట కోతాట గుండాట విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో కోడిపందాలు నిర్వహించడంతో పందాల రాయులకు ఆనందానికి అవధులే లేవు భారీగా కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.