- ఎరవేసి సొమ్మంతా ఎగరేసుకుపోతున్నారు
- ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి అంతా పోగొట్టుకుని యువకుడి ఆత్మహత్య
- గోదావరి జిల్లాలే టార్గెట్‌గా రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు


గోదారోళ్లు అంటే ఎటకారం మామూలుగా ఉండదు మరి అంటారు చాలా మంది. అయితే చాలా మందిలో కొంత అమాయకత్వం, వెంటనే నమ్మేసే మనస్తత్వం.. ఎవ్వరు ఏది చెప్పినా వినే గుణం కూడా ఉంటుంది. ఇదే ఇప్పుడు సైబర్‌ నేరగాళ్ల నేరాలకు ఆయువుపట్టుగా నిలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల వాసులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. మాయ మాటలతో కొంత పెట్టుబడి పెట్టండని నమ్మబలికి నయావంచనకు పాల్పడుతున్నారు. యువకులు అయితే ఆన్‌లైన్‌ గేమ్‌లతో వారిని పడేసి వారి వద్దనుంచి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈతరహా సైబర్‌ నేరాలు మరీ ఎక్కువవుతుండగా ఇందులో రైతులు, చిరు ఉద్యోగులు, బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటున్నవారు సైతం బాధితులుగా మారుతున్నారు. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం గంటి పంచాయతీ పరిధిలోని పల్లిపాలెంలో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడిన ఓ యువకుడు తన మేనత్త పంపిన డబ్బును మొత్తం పోగొట్టుకుని చివరకు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్నినింపింది..


గల్ఫ్‌ నుంచి డబ్బు పంపిన మేనత్త.. కానీ!
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని గంటి గ్రామ పరిధిలో పల్లిపాలెంకు చెందిన చీకురుమిల్లి సాధ్విక్‌(19) ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్నేహితుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న కుటుంబికులు షాక్‌కు గురయ్యారు. ఇంతకీ సాధ్విక్‌ గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ గేమ్‌ బాగా ఆడాడని, ఇందులో తన వద్దనున్న రూ.78,000 పోగొట్టుకున్నట్లు చెప్పాడని చెప్పారు. ఇంతకీ ఆ డబ్బు గల్ఫ్‌లో ఉంటోన్న తన మేనత్త ఇటీవలే సాథ్విక్‌ తాతయ్య ఆపరేషన్‌ నిమిత్తం ఈ డబ్బును పంపించింది. సాధ్విక్‌ ఎకౌంట్‌కు ఈ మొత్తాన్ని పంపించగా మరికొన్ని రోజుల్లో తాతయ్య ఆపరేషన్‌ చేయించాల్సి ఉంది.. గత కొంతకాలంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడిన సాధ్విక్‌ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చన్న ఆశతో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడినట్లు తెలుస్తోంది. ఎకౌంట్‌లో ఉన్న రూ.78 వేలు మొత్తం ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల పోగొట్టుకోవడంతో ఈ విషయం ఇంట్లో తెలిస్తే  మందలిస్తారని తీవ్ర ఆందోళనకు గురైన సాధ్విక్‌ రాత్రి ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..


ఏదోలా బుట్టలో పడేసి కాజేస్తున్న వైనం..
ధవళేశ్వరం లక్ష్మీనరసింహ నగర్‌కు చెందిన రైల్వేఉద్యోగి వెల్నాటి శ్రీహరి సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్క ఏకంగా రూ.35 లక్షల సొమ్మును పోగొట్టుకున్నాడు. తమ వయూట్యూబ్‌ ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేసి పెట్టుబడి పెడితే ఏకంగా 30 శాతం కమీషన్‌ ఇస్తామంటూ నమ్మించి చివరకు రూ.35, 23, 440 సొమ్మును దోచేశారు. రూ.5 వేలు చొప్పున డిపాజిట్‌లు చేసినందుకు రూ.6,500 వెంటనే పంపించి ఇలా పలుసార్లు వేసిన క్రమంలో తిరిగి డబ్బులు వేస్తూ పూర్తిగా నమ్మాక దఫదఫాలుగా రూ.35లక్షలకు పైగా డబ్బును ట్రాన్స్ ఫర్ చేయించుకుని ఆపై ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు.


ఆధార్‌ లింక్‌ చేస్తామంటూ మరో మోసం..
ఇటీవలే అమలాపురం నియజకవర్గం పరిధిలోని ఉప్పలగుప్తం మండల పరిధిలో ఓ చిరు వ్యాపారిని బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని, మీ ఖాతాకు ఆధార్‌ నెంబర్‌ జతపర్చాలని, ఇది చేస్తే ప్రభుత్వం నుంచి రూ.26 వేలు వస్తాయని నమ్మించాడు. తొలుత అనుమానం పడి వివరాలేవీ చెప్పకపోయినా సదరు వ్యక్తి నమ్మేలా నైస్‌గా మాట్లాడిన సదరు వ్యక్తి మాటలకు పడిపోయాడు. మీ సెల్‌కు ఒక మెసేజ్‌ వస్తుందని అంటూ లైన్లో ఉండమంటూనే.. మీసెల్‌కు ఓక మెసేజ్‌ వచ్చింది అది చెప్పాలని చెప్పడండంతో అతను ఆ ఓటీపీను చెప్పడంతో ఎకౌంట్‌లో ఉన్న రూ.58 వేలు మాయం చేశారు. ఆతరువాత అసలు విషయం తెలుసుకుని తనకు వచ్చిన ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్... చివరకు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు.


అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..
ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌, సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏ బ్యాంకు కానీ, ఏ ప్రభుత్వ రంగ సంస్థలైనా కానీ మీయొక్క ఆధార్‌ కార్డు, ఇతర వివరాలేమీ చెప్పమని అడగవని, అయితే సైబర్‌ నేరగాళ్లు విసిరే వలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అదేవిధంగా పిల్లలు సెల్‌ఫోన్లులో ఆన్‌లైన్‌ గేమ్‌స్స ఆడుతున్నారేమో ఓ కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు. అదేవిధంగా సులభంగా డబ్బు వస్తుందన్న కల్లబల్లి మాటలు విని ఎవ్వరికీ డబ్బులు జమ చేయవద్దని హెచ్చరించారు.