అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం సీఎం జగన్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు ఏపీ సీఎం హాజరుకానున్నారు. జూన్ 7న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంవో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.   


వివాదాస్పదమైన జనసేన ఎమ్మెల్యే రాపాక ఇంట్లో పెళ్లి కార్డు ! 


రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కుమారుడి పెళ్లి త్వరలో జరగనుంది. రాపాక త‌న‌ కుమారుడి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ముద్రించిన శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని అందులో పేర్కొన్నారు. శుభలేఖ పైభాగంలో జగన్ భారతి చిత్రాలు ఆకట్టుకునేలా ముద్రించారు. వారిని దైవ సమానులుగా పేర్కొన్నారు.       

             


ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే.. రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో టిక్కెట్ ఇవ్వలేదని చివరి రోజుల్లో ఆయన జనసేనలో చేరితే వెంటనే బీఫాం ఇచ్చారు పవన్ కల్యాణ్. జనసేన కోసం కొంత మంది పార్టీ నేతలు కష్టపడినప్పటికీ రాపాక మాజీ ఎమ్మెల్యే కావడంతో టిక్కెట్ ఇచ్చారు. అదృష్టం బాగుండి.. త్రిముఖ పోరులో రాపాక చాలా స్వల్ప తేడాతో విజయం సాధించారు. కొద్ది రోజులకే ఆయన పవన్ కల్యాణ్ ను విమర్శించి పార్టీకి దూరయ్యారు. గతేడాది జూన్‌లో పి.గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించగా.. అందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాపాక... అధికార పార్టీ వైఎస్సార్సీపీ కండువా కప్పుకొని వేదికపై కనిపించడం సైతం అప్పట్లో ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది.


జగన్ పై విధేయత చాటుకున్న జనసేన ఎమ్మెల్యే రాపాక.. 
ఇప్పటికే పలుమార్లు బయట అసెంబీలో జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ రాపాక మాట్లాడి తన వీర విధేయతను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఏకంగా తన కుమారుడి పెళ్లి ఆహ్వానపత్రికపై సీఎం దంపతుల ఫొటోలు ముద్రించి తాను జగన్ కు వీరభక్తుడినని మ‌రోసారి చాటిచెప్పారు. ఈ పెళ్లి పత్రికపై వైసీపీ శ్రేణులు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జ‌నసేన పార్టీ త‌రుపున గెలిచి వైసీపీ గూటికి చేరిన కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు జ‌గ‌న్ ఆయ‌న‌కు సీటు ఖరారు చేశారు. దీంతో రాపాక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ట్ల ఉన్న‌కృత‌జ్ఞ‌త‌ల‌ను వినూత్నంగా తెలిపారని అంటున్నారు.