Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రాజెక్టు ఏరియాకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.
రెండుసార్లు ప్రాజెక్టు ప్రాంతంలో హెలికాప్టర్‌లో తిరిగిన సీఎం జగన్ పనులు తీరును పరిశీలించారు. గతం కంటే భిన్నంగా ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పోలవరం ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలను కూడా విపత్తులా చూపిస్తున్నారని మీడియాపై విమర్శలు చేశారు జగన్. గత ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాలీలు వదిలేశారని దీని వల్ల చాలా నష్టం వాటిల్లిందన్నారు. దీని వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రెండు వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇలాంటివి ఓ వర్గం మీడియాకు కనిపించడం లేదని విమర్శించారు. ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌కు సంబంధం లేని గైడ్‌వాల్ కుంగితే దాన్నో పెద్ద సమస్యగా చిత్రీకరించారన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఎం నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ చూశారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-2 వద్ద కోతకు గురైన డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని అధికురుల సీఎంకు వివరించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలవరం పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై కూడా జగన్ సమీక్ష నిర్వహించారు. కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్వాసితుల తరలింపు ప్రక్రియ కూడా పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే 12, 658 కుటుంబాలను తరలించినట్టు అధికారులు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్‌బండ్ కుంగిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. అధికారికంగా దనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. దాదాపు 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున ఈ గైడ్‌బండ్‌ను నిర్మించారు. ఏడాది నుంచి చేస్తున్న పనులు ఫైనల్ దశకు వస్తున్న టైంలో గైడ్‌బండ్ మధ్యలో క్రాక్స్ వచ్చాయని తెలుస్తోంది. ఇది అప్రోచ్ ఛానల్ వైపునకు కుంగి పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారులు ఈ విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశారు. గైడ్‌బండ్ ఎలా కుంగింది కారణాలు ఏంటనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.