TDP Protest: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ సీఐ టీడీపీ కార్యకర్తను కొట్టరంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమలాపురంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో సీఐ అతి ప్రదర్శించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ  రెండు చోట్ల గెలవడంపై అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బాణాసంచా కాల్చడంతో పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే సీఐ దుర్గా శేఖర్ రెడ్డి ఓ టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పట్టణ సీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట సీఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వెనక్కి తగ్గిన సీఐ దుర్గాశేఖర్ రెడ్డి చివరకు టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు.


"అమలాపురంలో కొత్తగా వచ్చిన రెడ్డి గారు సీఐ గారికి ఇష్టం లేదు. వైసీపీ పక్షపాతి అయినటువంటి సీఐకి తెలుగు దేశం పార్టీ సంబుబాలు చేసుకోవడం ఇష్టం లేక టీడీపీ కార్యకర్త వద్దకు వచ్చి టపాటపా మని చెంప మీద కొట్టాడు. క్షమాపణ చెప్పే వరకు ఊరుకోం. ఇందులో తప్పేం ఉంది. ఇది ప్రజాస్వామ్యమా కాదా. గెలిచిన ప్రతీ ఒక్కడూ సంబురాలు చేసుకుంటాడు. ఈలలు వేసుకుంటాడు, గోలలు వేసుకుంటాడు, మందు కాల్చుకుంటాడు. నిన్న కాక మొన్న వైసీపీ మందు కాల్చింది. అసెంబ్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ మందు కాల్చింది. అప్పుడు ఎందుకు ఈ సీఐ వెళ్లి అడ్డుకోలేదు. అప్పుడు ఎందుకు సీఐ కొట్టలేదు. సీఐ వైసీపీని కాపాడేందుకు వచ్చాడా అమలాపురానికి. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడా.. సీఐ గారు క్షమాపణ చెప్పి తీరాలి."  - టీడీపీ శ్రేణులు


ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. మూడు పట్టభద్రులు నియోకవర్గాల్లో ఎన్నికలు జరిగితే రెండింటిని కైవశం చేసుకుంది టీడీపీ. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోటాకు అనుకూలంగా ఓట్ల శాతం రాకపోవడంతో.. ఎలిమినేషన్ ప్రకారం విజేతను ప్రకటించారు. ఎలిమినేషన్ రౌండ్‌లో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారు. వాళ్లకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లకు కలుపుతారు. ఇలా రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. 


తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అంటే ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయకేతనం ఎగరేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందదారు. కంచర్ల శ్రీకాంత్ 34,108  ఓట్లతో ఘన విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తెలుగుదేశం అభ్యరర్థికి 11,511 రాగా... వైసీపీ అభ్యర్థికి 3,900 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధికి 50%+1 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు.