Constable Rescue Woman : యానం బ్రిడ్జి పై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని ప్రాణాలకు తెగించి కాపాడాడు కానిస్టేబుల్. యువతి గోదావరి దూకడం చూసిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబు వెంటనే గోదావరిలో దూకి యువతిని నీటిలో మునిగిపోకుండా రక్షించాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు కానిస్టేబుల్ చేసిన సాహసాన్ని మెచ్చుకున్నారు.
వీడియో వైరల్
ప్రాణలు తెగించి యువతిని కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ వీరబాబుపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. యానం బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయబోయిన ఒక అమ్మాయిని ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు వీరబాబుకు అభినందనలు తెలిపారు.
అభినందించిన ఎస్పీ
యానం మున్సిపాలిటీకి చెందిన ఒక యువతి ఎదురులంక బ్రిడ్జి పైనుంచి శుక్రవారం సాయంత్రం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అటుగా వెళుతున్న ఏఆర్ కానిస్టేబుల్ అంగాని వీరబాబు ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చి యువతి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి కానిస్టేబుల్ వీరబాబును ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందించారు. చదువు విషయంలో ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు యత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
యువతిని కాపాడిన కానిస్టేబుల్ కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సత్కారం
యానం వద్ద గోదావరిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని కాపాడిన ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అమలాపురం ది.అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ వీరబాబుకు సన్మానం చేశారు. దీంతో పాటు 5 వేల రూపాయలు నగదును అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయ సారథి, ఏఆర్ పోలీసు సిబ్బంది, ఛాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కొవ్వూరు బ్రిడ్జీ పై నుంచి దూకబోయిన యువకుడ్ని కాపాడిన ఎంపీ మార్గాని భారత్
ఇటీవల గోదావరిలో దూకబోయిన యువకుడిని ఎంపీ మార్గాని భరత్ రామ్ చాకచక్యంగా కాపాడారు. స్థానిక రోడ్డు కమ్ రైల్వే వంతెనపై ఫిబ్రవరి 14న ఈ ఘటన జరిగింది. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప ఎలక్రికల్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పనిచేశాడు. మంగళవారం బైక్ పై రోడ్డు కం రైలు వంతెనపైకి వచ్చాడు. మోటారు సైకిల్ ను పక్కనపెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన ఎంపీ భరత్ రామ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, కారులోంచి బయటకు దిగి, ఆ యువకుడిని పట్టుకుని రోడ్డు మీదకు లాగారు. ఎంపీ అనుచరులు కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎంపీ వెంటనే రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ గణేష్ కు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆ యువకుడిని ఆటోలో రెండో పట్టణ పోలీసుస్టేషన్ కు తీసుకువెళ్లారు. యువకుడిని కాపాడిన ఎంపీ భరత్ రామ్ ను పలువురు అభినందించారు.
వంతెనల వద్ద సీసీకెమెరాల నిఘా
వంతెనలపై వరుస ఆత్మహత్యలతో తీవ్ర కలకలం రేగుతోండడంతో పోలీసులు దృష్టిసారించి నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా వంతెనలపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యలు పాల్పడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఇటీవల వంతెనకు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడడం మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. వంతెనల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంచి అవసరమైతే పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.