AP Pension| నిరుపేదల ఇళ్లవద్దకే ప్రతీ నెల మొదటి రోజునే పింఛన్ అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే.. కొందరు సచివాలయ ఉద్యోగులు పింఛను సొమ్మును తమ జేబులో సొమ్ముగా భావించి జల్సాలు చేస్తున్నారు.. కేవలం పింఛను డబ్బునే కాకుండా పంచాయతీల ద్వారా వచ్చే ఈ సర్వీస్ బిల్లులను దారిమళ్లించి సొంత అవసరాలు తీర్చుకున్న వెల్ఫేర్ అసిస్టెంట్‌ల ఉదంతంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామ సచివాలయ పరిధిలో పనిచేసే ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ కమ్ డిజిటల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోన్న సచివాలయ ఉద్యోగి గత కొన్ని నెలలుగా తన పరిధిలో పింఛను దారులకు చెల్లించగా మిగిలిన సొమ్మును తిరిగి ఎప్పటికప్పుడు నాలుగో తేదీలోపునే ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి సొంత అవసరాలకు వాడుకుంటూ అధికారుల మాటలను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వానికే ఎగనామం పెట్టాడు. కేవలం పింఛను సొమ్మునే కాకుండా పలు ఈసర్వీసుల క్రింత వసూళ్లు అయిన రూ.16 వేలు సొమ్మును వాడేసుకున్నాడు. అయితే దీనిపై ఉన్నతాధికారులఆరాతీయగా సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ అసలు బండారం బయట పడిరది.
ఈనెల నాటికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.1.40 లక్షలు చెల్లించలేదు. చివరకు అధికారుల ఒత్తిడిమేరకు ఎట్టకేలకు మంగళవారం కొంత సొమ్మును దఫదఫాలుగా తిరిగి చలానా రూపంలో తిరిగి చెల్లించగా ఇంకా రూ.56 వేలుకు పైగా కట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు. వెల్ఫేర్ అసిస్టెంట్ రికార్డును పరిశీలిస్తే గతంలో రూ.3.50 లక్షలు పింఛను సొమ్మును వాడేసుకుని చివరకు డీఆర్‌డీఏ పీడీ ద్వారా నోటీసులు రావడంతో ఎట్టకేలకు తిరిగి చెల్లించాడని, పంచాయతీకు వచ్చే ఈ సర్వీస్ బిల్లులను కూడా స్వాహా చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 14 లక్షలు పెండింగ్
ఒక్క అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే పింఛన్లు ఇవ్వగా మిగిలిన సొమ్మును ప్రతీ నెల యాధావిధిగా ప్రభుత్వానికి తిరిగి జమ చేయాల్సి ఉండగా లక్షల రూపాయలు కట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో సొంత అవసరాలుకు వినియోగించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటువంటి తరహాలోనే పింఛను ఇవ్వగా మిగిలిపోయిన లబ్ధిదారుల పింఛను డబ్బును సొంత అవసరాలకు వినియోగిస్తున్న క్రమంలోనే అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఏకంగా రూ.14 లక్షలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన మొత్తం పెండిరగ్‌లో ఉండిపోయినట్లు తెలుస్తోంది.. దీనిపై డీఆర్‌డీఏ పీడీ గాంధీ వివరణ ఇస్తూ పింఛను మిగుల డబ్బును తిరిగి కట్టని ఉద్యోగులకు నోటీసులు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పింఛన్ డబ్బుతో క్రికెట్ బెట్టింగ్‌లు..
పింఛను రూ.4 వేలు చేసిన తరువాత మేజర్ పంచాయతీలలో అయితే రూ.80 లక్షల నుంచి రూ.2 కోట్లు వరకు పింఛను పంపిణీకు నగదు విత్‌డ్రాచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈనేపథ్యంలోనే వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఆయా సచివాలయ పరిధిని బట్టి పంచాయతీ కార్యదర్శులు బ్యాంకుల నుంచి డబ్బును విత్ డ్రా చేసి అందిస్తున్నారు. ఈ డబ్బును పింఛను దారులకు ఇవ్వకుండా కూడా పలాయనం చిత్తగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
గతంలో రూ.40 లక్షల పింఛన్ డబ్బుతో పిఠాపురానికి చెందిన ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ పారిపోయాడు. అలమూరు మండలంలో ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన పింఛన్ మిగుల డబ్బును చెల్లించకుండా సుమారు రూ.7 లక్షల వరకు దుర్వినియోగం చేయడంతో అతనిపై కేసు నమోదు అయ్యింది. ఇలా సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ డబ్బును మాయం చేయడం వెనుక బెట్టింగ్ వ్యసనం ఉందని పలువురు చెబుతున్నారు. చేతిలో ఉన్న డబ్బుతో బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వెల్ఫేర్ అసిస్టెంట్లు దాంట్లో సర్వం పోగొట్టుకుని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును పెండిరగ్ పెడుతున్నారని పలువురు చెబుతున్నారు.