ఇంటి పెరట్లోకి గేదె చొరబడి అరటి మొక్కలను ధ్వంసం చేయడంతో దాన్ని ప్రశ్నించిన పాపానికి ఓ యువకునిపై గేదె యజమాని విచక్షణ రహితంగా కర్రతో దాడిచేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుప్రతిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై బాధితుడి తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు తేలిగ్గా తీసుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. సాధారణ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ తరువాత బాధిత యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో హత్యాయత్నంగా కేసును నమోదు చేశారని బాధితుని కుటుంబం ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుని కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 


అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వడ్డి సునీల్ కుమార్ (26) ఇంటి పెరట్లోకి ఇదే గ్రామానికి చెందిన కుంచే సహదేవుడుకు చెందిన గేదె చొరబడి అరటి మొక్కలను ధ్వంసం చేసింది. దీనిపై సునీల్ కుమార్ కు సహదేవునికి మధ్య స్వల్ప వాగ్వాదం ఏర్పడింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గేదె యజమాని సహదేవుడు బలమైన కర్ర తీసుకుని వచ్చి ఆదమరచి ఉన్న సునీల్ కుమార్ తలపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయినా ఏమాత్రం ఆలోచించకుండా కిందపడిపోయిన బాధిత యువకుడి తలపై విచక్షణా రహితంగా కర్రతో మోదడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ పరిస్థితి గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. బాధిత యువకుని తల్లితండ్రులు రవి కుమార్, రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ప్రాణాపాయ స్థితిలో బాధితుడు
తలపై తీవ్ర గాయాలపాలైన బాధిత యువకుడు అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. ఇప్పటికే తలలో రక్తం క్లాట్ ఏర్పడిందని శస్త్ర చికిత్స చేశారని, దాడిలో తల పైభాగం చాలా వరకు ఛిద్రమైందని వైద్యులు తెలిపారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంత దారుణంగా దాడి చేసిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొందరి సిఫారసులతో వదిలివేశారని, ఆ తరువాత అమలాపురం రూరల్ సీఐకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల తర్వాత అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకుణ్ని ఇలా విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువకుని కుటుంబం డిమాండ్ చేస్తోంది.