Konaseema News: రాత్రి వేళల్లో ఆ గ్రామంలో ఎవ్వరూ నిద్రపోవడం లేదు... పెద్దలు, యువత రోడ్లు,భవనాల పై కాపలా కాస్తున్నారు ..  కోనసీమ జిల్లాలోని ఐ. పోలవరం మండలంలోని టి. కొత్తపల్లి గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది.


ఎవరైనా తలుపు తడితే చాలు వారి అరచేతుల్లో ప్రాణాలు పట్టుకుని ఒకరికి ఒకరు ఫోన్ చేసుకుని తలుపులు తీసే పరిస్థితి టి.కొత్తపల్లి గ్రామంలో నెలకొంది. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే... కొన్ని రోజులుగా ఈ గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.. ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలు కరెంటు పోయినప్పుడే జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతుండగా తలుపు తట్టిన చప్పుడు వినపడి తలుపు తీస్తే ముఖంపై మత్తు మందు స్ప్రే చేసి ఇళ్ళల్లో నగదు, నగలు వస్తువులు దోచుకెళుతున్నారు దుండగులు.


దీంతో రాత్రయితే చాలు దొంగల భయంతో హడలిపోతున్నారు గ్రామస్తులు. రాత్రి వేళలో తలుపులు తీయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకుని మరి తీయాల్సిన పరిస్థితి టి.కొత్తపల్లి గ్రామంలో ఏర్పడింది. ఈ గ్రామంలో గత 15 రోజులుగా కంటి మీద నిద్ర లేకుండా గడువు తున్న గ్రామస్తులు పోలీసుల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోక పోవడంతో రాత్రి సమయంలో దొంగల కోసం తామే కర్రలతో పెద్దలు, యువత గ్రామంలో అంతా కలిసి ఇలా కాపలా కాస్తున్నామని చెప్తున్నారు.


గత 15 రోజులుగా ఇదే పరిస్థితి..
ఐ. పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామంలో గత పదిహేను రోజులుగా ఇంటి తలుపులు కొట్టి యజమానులపై మత్తు మందు స్ప్రే చేసి ఇంటిలో ఉన్న నగలు, డబ్బు దొంగలు దోచుకెళుతున్నారని టి.కొత్తపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామస్థులు పోలీసులకు ఇప్పటికే పిర్యాదు చేశామని తెలిపారు. దీంతో రెండు రోజులు రాత్రి సమయంలో గస్తీ కాచిన పోలీసులు తరువాత పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేసేది ఏమిలేక దొంగలను పట్టుకోవడానికి టార్చి లైట్లు కర్రలు పట్టుకొని డాబాలపైన, గ్రామంలో కాపలా కాస్తున్నామని, ఈ దొంగల బెడద నుంచి పోలీసులు కాపాడాలని టీ కొత్తపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.