Rajamahendravaram Politics: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారుతోంది. రోజుకొక కొత్తపేరు తెరపైకి వస్తుండటంతో సామాన్య కార్యకర్తలతోపాటు కాకలు తీరిన నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. నిన్నటి వరకు సీటుపై ఉన్న గ్యారెంటీ తెల్లారితే ఉండటం లేదు. అన్న సీటు వచ్చి గెలిస్తే ఆదుకుంటాడని వెనక తిరిగి జేజేలు కొట్టిన అనుచరగణానికి ఏమీ అంతుబట్టడం లేదు. పొత్తులు, ఎత్తులు, కుల సమీకరణాలు బేరీజు వేసుకునిగానీ.. ప్రధాన పార్టీలు సీట్లు కన్ఫర్మ్ చేయడం లేదు. ముఖ్యమైన సీట్లు, పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కాస్త పెట్టుబడి పెట్టగలిగిన వారి కోసమే అన్వేషిస్తున్నాయి.
విశాఖ నుంచి విజయవాడకు మధ్యలో ఎంతో కీలకమైన రాజమహేంద్రవరం (Rajahmundry) లోక్ సభ సీటుపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. తెలుగు దేశం (TDP) పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానాన్ని మరోసారి తమ ఖాతాలో వేసుకునేందుకు అధిష్టానం కీలక పావులు కదుపుతోంది. గతంలో ఇక్కడి నుంచి విజయం సాధించిన పార్టీ సీనియర్ నేత మురళీమోహన్ (Murali Mohan) కుటుంబం ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆయన కోడలు రూప సైతం ఆసక్తి చూపకపోవడంతో తెలుగుదేశం కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది.
చంద్రబాబుకు నమ్మినబంటు
చంద్రబాబు (Chandra Babu) కు నమ్మినబంటుగా దిల్లీస్థాయిలో చక్రం తిప్పగలిగే నేతగా, అత్యంత వివాదరహితుడిగా ఉన్న మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు (Kambampati RammohanRao) ను ఈసారి రాజమండ్రి బరిలో దింపేందుకు తెలుగుదేశం(Tdp) పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. ఆర్థికంగానూ, సామాజికవర్గపరంగానూ అధికారపార్టీని ఢీకొట్టాలంటే గట్టి క్యాండెట్ ను నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ విధేయుడిగా.. అధినేత చెప్పిన పని చెప్పినట్లు చేసి పెడతారని కంభంపాటి రామ్మోహన్‌రావుకు పేరు. కష్టకాలంలో ఎంతోమంది పార్టీని వీడినా జగన్ ( Jagan) వంటి నేతల బెదిరింపులకు తలొగ్గక ఎల్లప్పుడూ పార్టీనే అంటిపెట్టుకుని ఉండటం ఆయనకు కలిసొచ్చినట్లు ఉంది. లక్ష్మీ ఆటోమైబైల్స్ పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో బైక్ లు, కార్ల షోరూంలు కలిగిఉన్న కంభపాటి రామ్మోహన్‌రావు ఆర్థికంగానూ మంచి స్థితిమంతుడు కావడంతో రానున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా ఆయన పేరు ప్రస్పుటంగా వినిపిస్తోంది. ముఖ్యంగా వివాదరహితుడిగా ఉండటం, పార్టీలో అందరితోనూ కలుపుగోలుతనంగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు.
రిజర్వ్ బెంచ్ ఖాళీ లేదు
ఒకవేళ కంభంపాటి రామ్మోహన్‌రావు కాదనుకుంటే పార్టీ సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకటరమణతోపాటు గన్ని కృష్ణ, శిష్ట్లా లోహిత్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో బొడ్డు వెంకటరమణ( Boddu Venkata Ramana)కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన తండ్రీ భాస్కర రామారావు...తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే పనిచేశారు. పెద్దాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. వీరి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచి పలుకుబడి ఉండటంతోపాటు రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం వ్యాప్తంగా అనుచరణం ఉంది. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న చాలామంది నేతలు భాస్కర రామారావు శిష్యులే. దీంతో ఆయను వెంకటరమణ పేరు పరిశీలనలో ఉంది. మరో కీలక నేతలు గన్ని కృష్ణ( Ganni Krishna).... శిష్ట్లా లోహిత్ పేర్లు సైతం అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి.
లోక్ సభ బరిలో మంత్రి
సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharath)ను ఈసారి రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా వైకాపా బరిలో దించుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఫ్యాన్ గాలి వీచినా..రాజమండ్రిలో మాత్రం ఆ పార్టీకి ఉక్కపోత తప్పలేదు. సిటీ, గ్రామీణ రెండు సీట్లు తెలుగుదేశం ఎగరేసుకుపోయింది. ముఖ్యంగా సిటీలో ఆదిరెడ్డి వాసు ఆధిపత్యం అధికారపార్టీకి మింగుడుపడటం లేదు. ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావించిన వైకాపా అధిష్టానం సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ ను రంగంలోకి దింపింది. ఈసారి రాజమండ్రి లోక్ సభ నుంచి మంత్రి వేణుగోపాల కృష్ణ పోటీ చేయనున్నారు. ఆయన మళ్లీ అసెంబ్లీ సీటు కోసమే ప్రయత్నించినా....జగన్ గట్టిగా చెప్పడంతో కాదనలేక రాజమండ్రి నుంచి లోక్ సభకు బరిలో దిగుతున్నారు.