IB syllabus in AP Schools: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం (2025 జూన్) నుంచి ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) సిలబస్ అమల్లోకి రానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనవరి 31న తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో మొదట 1వ తరగతి నుంచి మొదలై.. ఆ తర్వాత రెండు.. ఇలా ఏటా ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుందని సీఎం వెల్లడించారు. 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి 12వ తరగతిలో ఐబీ బోధన ప్రారంభమవుతుంది. ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తి ఇస్తోందన్నారు. 


భవిష్యత్ తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలవాలన్నా.. భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. ఇప్పుడున్న విద్యా విధానాలను ఉన్నతీకరించాలి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ విధానంలో ఎడ్యుకేషన్ నాలెడ్జ్‌ని వినియోగించడం కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ముందు ఉపాధ్యాయులకు, సిబ్బందికి సామర్థ్యాలు పెంచేలా వచ్చే ఏడాదిలో శిక్షణ కార్యక్రమాలు అమలవుతాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిలో ఐబీ భాగస్వామ్యంతో బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని సీఎం జగన్ వివరించారు.


ఒప్పందం..
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో బుధవారం ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటోన్ బిగిన్‌తో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒప్పందం చేసుకున్నారు. ఇంత పెద్ద స్థాయిలో భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని ఆన్‌లైన్‌లో హాజరైన ఐబీ డైరెక్టర్ జనరల్ ఒలీ పెక్కా హీనోనెన్ పేర్కొన్నారు. భారత్‌తో విద్యా రంగంలో మా సంబంధాలు మరింత మెరుగుపడతాయి. తొలుత ఆటల ఆధారిత అభ్యసన విధానంతో పిల్లల్లో ఆసక్తిని పెంచుతాం. వారు మాతృభాషతో పాటు విదేశీ భాషలు నేర్చుకోవడంపైనా దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాల్గొన్నారు.


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం విద్య, అనలిటిక్స్ కోసం బైజూస్ కంటెంట్ వాడకం ద్వారా పోటీ తత్వాన్ని పెంచుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అంతర్జాతీయంగా వారు పోటీ పడేలా ఐబీ సిలబస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యా పరిశోధనా మండలి ఎస్.సి.ఈ.ఆర్.టితో అంతర్జాతీయ విద్యాబోర్డు అయిన ఐబీని భాగస్వామిగా మారుస్తూ ఒకటో తరగతి నుంచి క్రమంగా ప్రవేశపెడుతున్న ఈ ఉమ్మడి సిలబస్ తో ఎన్నో ప్రయోజనాలు ఉండబోతున్నాయి.

ఉపాధ్యాయులు సిద్ధం కావాల్సిందే..
రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టాలంటే ముందుగా ఉపాధ్యాయుల్ని అందుకు సిద్ధం చేయాలి. ఈ ప్రక్రియ చేపట్టేందుకు వచ్చే విద్యాసంవత్సరాన్నివాడుకోనున్నారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఏడాది దాన్ని రెండో తరగతికి విస్తరిస్తారు. అలా 2035 నాటికి పదో తరగతికి, 2037 నాటికి పన్నెండో తరగతికి దీన్ని విస్తరిస్తారు. ఇలా ఐబీ సిలబస్‌లో చదివిన వారికి ఐబీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి సర్టిఫికెట్లు ఇస్తారు.


అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..
ఐబీ సిలబస్ తో విద్యార్ధులు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యుత్తమ బోధనా పద్ధతులు ఇందులో ఉంటాయి. బట్టీ చదువులకు బదులు థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అంతేకాదు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహిస్తారు. సిలబస్ రూపకల్పనతో పాటు బోధనా పద్ధతులు, మూల్యాంకనం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.