మెగాస్టార్ చిరంజీవి విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నారు. 'ఖైదీ నంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బ్రేక్ తీసుకున్నది లేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరు నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర' సెట్స్ మీద ఉంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకుడితో ఆయన సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి?
హరీష్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ దర్శకుడు అని ముద్ర పడింది. ఆయన పవర్ స్టార్ వీరాభిమాని కావడం అందుకు ఓ కారణం అయితే... పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'గబ్బర్ సింగ్' ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాయడం మరో కారణం. హరీష్ శంకర్ మెగా అభిమానం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు మెగాస్టార్ చిరును డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


చిరంజీవి హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మెగా డాటర్ సుశ్మిత సంయుక్తంగా నిర్మిస్తారని తెలిసింది. ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందిస్తున్నారట. 'సోగ్గాడే చిన్ని నాయనా' ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయాలని అనుకున్న కథను ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయడానికి చిరంజీవి రెడీ అవుతున్నారట. నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీది అయితే... నిర్మాణ బాధ్యతలు చిరు కుమార్తెవి అని టాక్. లాభాల్లో ఇద్దరూ వాటా తీసుకుంటారట.  


రవితేజతో 'బచ్చన్ సాబ్' తర్వాత?
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అది 'బచ్చన్ సాబ్'. హిందీ హిట్ 'రైడ్' కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు, చేర్పులు చేరి రూపొందిస్తున్నారని తెలిసింది. నిజం చెప్పాలంటే... ఈ 'బచ్చన్ సాబ్' సినిమా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా స్టార్ట్ చేశారు హరీష్. అయితే... జనసేన పార్టీ కార్యక్రమాలు, ఏపీ ఎన్నికల నేపథ్యంలో హీరో బిజీ కావడంతో మధ్యలో మరో సినిమా చేయడానికి వచ్చారు.


Also Read'దిల్' రాజు ఇంట్లో పెళ్లి సందడి - యంగ్ హీరోకి కాబోయే భార్య ఎవరంటే?


'బచ్చన్ సాబ్' షూటింగ్ కంప్లీట్ అయ్యి థియేటర్లలోకి వచ్చే సరికి ఏపీలో ఎన్నికలు పూర్తి అవుతాయి. ఈలోపు చిరంజీవి 'విశ్వంభర' చిత్రీకరణ కూడా పూర్తి అవుతుంది. మరి, చిరంజీవి - హరీష్ శంకర్ సినిమా 'బచ్చన్ సాబ్' తర్వాత సెట్స్ మీదకు వెళుతుందా? లేదంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తి అయ్యాక మొదలు అవుతుందా? అనేది చూడాలి. ఉస్తాద్ కాకుండా పవన్ చేతిలో 'ఓజీ', 'హరిహర వీరమల్లు' సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ముందు పూర్తి చేయాలని పవన్ అనుకుంటే చిరు - హరీష్ సినిమాకు లైన్ క్లియర్ అవుతుంది.


Also Readబ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి, గుండెల్ని పిండేసేలా హాస్య బ్రహ్మ కంటతడి పెట్టించిన క్యారెక్టర్లు ఏవో తెలుసా?