ఆస్తి వివాదంలో కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీత..
గీత, ఆమె సోదరి కుసుమపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వదిన


కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతపై ఆమె వదిన పుప్పాల కళావతి కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లాకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఎంపీ గీతపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. 2006లో తన భర్త అయిన దివంగత కృష్ణకుమార్‌ చే బలవంతంగా ఆస్తులను రాయించుకున్నారని, తాను, తన పిల్లలు కోర్టులో న్యాయపోరాటం చేస్తుంటే తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఫిర్యాదు చేసిన కళావతి ఎవరు..?
సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కళావతి కాకినాడ ఎంపీ వంగా గీతకు స్వయానా వదిన.. వంగా గీత సోదరుడు కృష్ణకుమార్‌ 2010లో మృతిచెందారు. అంతకుముందు తన భర్త చేత బలవంతంగా తమకు దక్కాల్సిన ఆస్తుల వాటాలను బలవంతంగా వంగా గీత, ఆమె సోదరి కుసుమ కుమారి, ఆమె భర్త కలిసి ఆస్తులను రాయించుకున్నారని ఫిర్యాదుదారు కళావతి ప్రధాన ఆరోపణ కాగా ఈ వివాదం గత కొంతకాలం వీరి మధ్య నడుస్తోంది. అయితే అన్ని విధాలా నష్టపోయిన తమకు న్యాయం చేయాలంటూ కళావతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. 


వంగా గీత, సోదరి కుసుమ కుమారి దంపతులపై ఆరోపణ..
ఆస్తుల వివాదం కోర్టులో ఉండగా ఎంపీ వంగా గీత, ఆమె సోదరి కుసుమ కుమారి, ఆమె భర్త లు కలిసి ఆస్తి కోసం తనను, తన పిల్లలను బెదిరిస్తున్నారని కళావతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త, వంగా గీత సోదరుడు కృష్ణకుమార్‌ 2010లో మృతిచెందారని, రామచంద్రపురం నియోజకర్గంలోని ద్రాక్షారామంలో వారసత్వంగా రావాల్సిన 6.50 ఎకరాల భూమిని, కాకినాడలోని 600 గజాల ఇంటిని ఆక్రమించుకుని ఆయన మరణానికి ముందే ఆయనను బెదిరించి తనకు దక్కాల్సిన ఆస్తినంతటినీ బలవంతంగా రాయించుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం కోర్టులో పోరాడుతున్న తమను బెదిరిస్తున్న ఎంపీ గీత, ఆమె భర్త విశ్వనాధ్‌, ఆమె సోదరి కుసుమ కుమారి, కనకాల రవికుమార్‌ దంపతులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెర్టర్‌ కృతికాశుక్లాను కళావతి కోరారు. 


తన కుటుంబాన్ని చంపాలని చూస్తున్నారు..
ఎంపీ వంగా గీతపై కళావతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను, తన పిల్లలు న్యాయం కోసం కోర్టులో పోరాడుతుంటే తమపై హత్యాప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంతో తన కుమారుడు రెండు నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ తొమ్మిదిన తమ ఇంట్లో దొంగతనం చేయించారని, 30 కాసుల బంగారం, రూ.50 వేలు నగదు దొంగలు ఎత్తుకెళ్లారని, ఈ సంఘటనపై సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 


జడ్పీ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా...
వంగా గీత గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 1995లో కొత్తపేట మండలం నుంచి టీడీపీ తరపున జడ్పీటీసీగా ఎన్నికైన వంగా గీత అనూహ్యంగా జడ్పీ ఛైర్మన్‌ పదవిని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా సేవలు అందించారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాడ్డాక 2009లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆతరువాత ఆమె తటస్థంగా ఉండిపోయారు. వైసీపీలో చేరిన వంగా గీతకు 2019లో అనూహ్యంగా కాకినాడ ఎంపీ సీటు కేటాయించింది వైసీపీ అధిష్టానం.. ఎన్నికల్లో కాకినాడ లోక్‌ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు వంగా గీత. 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన వంగా గీత తొలుత శిశు సంక్షేమ రీజనల్‌ ఛైర్‌పర్సన్‌గా నామినేటెడ్‌ పదవిని పొందారు.