Kakinada Private Hospital: కాకినాడలో (Kakinada News) ఓ ప్రైవేటు ఆస్పత్రి మోసం దాదాపు 9 నెలలకు బయటపడింది. కాసుల కోసం ఏకంగా గర్భం అని నమ్మించి నెలల తరబడి పరీక్షలు చేసి వేలకు వేలు గుంజారు. తీరా ప్రసవానికి వస్తే అసలు లోపల శిశువే లేదని చెప్పారు. ఇంతటి అన్యాయకరమైన ఘటన కాకినాడలో (Kakinada News) మంగళవారం వెలుగులోకి వచ్చింది. గర్భవతి అని చెప్పి 9 నెలల పాటు తిప్పించుకుని, మెడికల్ టెస్టులు చేసి, లోపల బిడ్డ బాగుదంటూ మందులు రాసిచ్చారని, తీరా ప్రసవం తేదీన వెళితే కాదని చెప్పారని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. 


బాధితురాలి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన వి.సత్యనారాయణతో కొన్నేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఈ ఏడాది జనవరిలో తన భార్యను వైద్య పరీక్షల కోసం కాకినాడ గాంధీ నగర్‌లోని రమ్య అనే ప్రైవేటు ఆసుపత్రికి సత్యనారాయణ తీసుకొచ్చారు. అదే రోజు మహాలక్ష్మికి మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు ఆమె గర్భం దాల్చిందని తేల్చారు. దానికి సంబంధించి రిపోర్టు కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ ఉంటోంది. 


కొద్ది వారాలకోసారి పిండం ఎదుగుదల పరీక్షల కోసం తరచూ ఆసుపత్రికి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా డాక్టర్లు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసి, మందులు రాసి ఇచ్చేవారు. ఆరో నెలలో స్కానింగ్‌ తీసి, సెప్టెంబరు 22న ప్రసవం అవుతుందని ఓ డేట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆమెను యానంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు స్కానింగ్‌ తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


అసలు మహిళ గర్భంతోనే లేదని తేల్చి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న భర్త తన భార్య మహాలక్ష్మిని కాకినాడ రమ్య ఆసుపత్రికి తీసుకొచ్చి స్కానింగ్‌ చేయాలని కోరాడు. ఇప్పుడు చేయబోమని వారు చెప్పడంతో కచ్చితంగా స్కానింగ్ చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. ఆస్పత్రి సిబ్బంది స్కానింగ్‌కు పంపారు. స్కానింగ్‌ తీసే టెక్నీషియన్ మహాలక్ష్మి గర్భంలో అసలు శిశువు లేదని చెప్పారు. ఇదేమిటని డాక్టర్ ని ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పిందని బాధితులు అంటున్నారు.


తొమ్మిది నెలల నుంచి తమను ఆసుపత్రి చుట్టూ తిప్పించుకొని రూ.వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టించుకున్నారని కమలాదేవి వాపోయారు. గర్భంలో పిండం చక్కగా ఉందని, బాగా ఎదుగుదల ఉందని చెప్పేవారని వివరించారు. అలా ప్రతి నెలా మందులు రాసిచ్చారని, వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట ముందుకు వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట బాధిత బంధువులు అందరూ ఆందోళనకు దిగారు. బాధితులకు మహిళా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. వారి సాయంతో పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.